Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఆఫీసుల్లో పని లేట్ అయితే అధికారులపై సస్పెన్షన్ వేటు.. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం

ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్దేశిత సమయంలో ఒక పని పూర్తి కావడం దాదాపు అసాధ్యం. ఒక పని కోసం లెక్కలేనన్ని సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ, ఈ పరిస్థితిని మార్చడానికి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత సమయంలోపు ప్రభుత్వ సేవలను సాధారణ ప్రజలకు అందించడంలో విఫలమైతే సదరు అధికారికి రూ. 20వేల వరకు జరిమానా విధించడానికి సిద్ధమైంది.
 

staff has to face fine for delay in discharging government services in haryana
Author
Chandigarh, First Published Sep 10, 2021, 8:28 PM IST

చండీగడ్: ప్రభుత్వ ఆఫీసుల్లో పని అంటేనే సాధారణ ప్రజలు జంకుతారు. ఒకట్రెండు సార్లు పోతే ఆ పనులు జరగవు. డేట్లపై డేట్లు చెబుతూ అధికారులు పనులను వాయిదా వేస్తుంటారు. కచ్చితమైన సమయానికి నిర్దేశిత పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండదు. అందుకే గవర్నమెంట్ ఆఫీసుల్లో పని అంటే ఆశామాషీ వ్యవహారం కాదనేది సాధారణంగా ఏర్పడిన అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మార్చడానికి హర్యానా రైట్ టు సర్వీస్ కమిషన్ యాక్ట్ చీఫ్ కమిషనర్ టీసీ గుప్తా కంకణం కట్టుకున్నారు. నిర్దేశిత సమయంలోపు ప్రజలకు సేవలు అందించడంలో విఫలమైన సుమారు 250 మంది అధికారులకు నోటీసులు పంపినట్టు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రూ. 20వేల వరకు జరిమానా విధిస్తామని వివరించారు. ఆ జరిమానా మొత్తాన్ని సదరు ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే వారి జీతం నుంచి కట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి మూడుసార్ల కంటే ఎక్కువ సార్లు జరిమానా విధించాల్సి వస్తే సదరు అధికారులను బాధ్యతల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా సంబంధిత శాఖకు సూచిస్తామని వివరించారు. ఇలా సేవలు పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొన్న బాధితులకు రూ. 5000 వరకు కమిషన్ పరిహారం అందజేస్తుందని గుప్తా వెల్లడించారు.

కమిషన్ సభ్యులతో నిర్వహించిన భేటీలో ఆయన కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల్లో సర్వీస్ యాక్ట్‌పై అవగాహన పెరుగుతున్నదని వివరించారు. ప్రజలకు సేవలందించడంలో జాప్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటే ఆయా శాఖలు మరింత మెరుగవుతాయని చెప్పారు. ఈ కమిషన్ పరిధిలో 31శాఖలు, 546 సేవలు ఉన్నాయని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios