శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పౌరుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నది. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో వారు దినదిన గండంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆ దేశం నుంచి మన దేశంలోకి శరణార్థులుగా వస్తున్నారు. తాజాగా, ఈ రోజు ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు భారత తీరానికి వచ్చి శరణార్థులుగా స్వీకరించాలని అభ్యర్థించారు. వీరితో కలిపి మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 90 మంది శ్రీలంక పౌరులు శరణార్థులుగా వచ్చారు.
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం దగ్గర విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో ఇంధనం సహా ఇతర నిత్యావసరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్తోమత లేకపోయింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా, దేశంలో చమురు నిల్వలూ పూర్తిగా కరిగిపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. తద్వార వాహనాల కదలికలను తగ్గించవచ్చని భావించింది. అక్కడ జీవితం కష్టప్రాయంగా మారింది. దీంతో పలువురు పౌరులు ఇతర దేశాలకు శరణార్థులకు తరలి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు కూడా శ్రీలంక పౌరుల తాకిడి తలుగుతున్నది. తాజాగా, ఈ రోజు అంటే జూన్ 17న శ్రీలంక నుంచి రెండు కుటుంబాలు భారత తీరంలో కనిపించాయి. మన దేశంలో శరణార్థులుగా స్వీకరించాలని వారు అభ్యర్థించారు.
రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ఈ రోజు భారత సముద్ర తీరానికి వచ్చారు. భారత దేశంలో తమకు శరణార్థుల హోదా కల్పించి ఇక్కడ ఆశ్రయం కల్పించాలని వారు కోరారు. ఈ ఏడుగురు ఇద్దరు వయోజనులు కాగా.. నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిని మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారు. వారిని విచారించనున్నారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా వారు శరణార్థులుగా పొరుగు దేశమైన భారత్‌కు రావలసి వచ్చింది. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు శ్రీలంక నుంచి 90 మంది మన దేశంలోకి వచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన 83 మందిని రామేశ్వరంలోని మండపం శరణార్థుల శిబిరానికి అధికారులు పంపారు.
ఇప్పటి వరకు శ్రీలంకలోని త్రింకోమాలీ, మన్నార్ యళపానం, వవూనియాల నుంచి ఆ దేశ పౌరులు మన దేశానికి వచ్చారు.
ప్రస్తుతం శ్రీలంకలో ఇంధన నిల్వలు పూర్గిగా అడుగంటిపోవడంతో ప్రభుత్వం హాలీడే ప్రకటించింది. పెట్రోల్ పంప్‌లలో ఇంధనం లేదు. మళ్లీ ఇంధన సరఫరా వస్తే.. కొనుగోలు చేయడానికి ఆ దేశ పౌరులు తమ వాహనాలతో పెట్రోల్ పంప్‌ల ముందు పెద్ద క్యూలు కట్టారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు శ్రీలంకకు చమురు నిల్వలు వస్తున్న దాఖలాలు లేవు. ఇది వరకు ఏ కంపెనీ, ఏ దేశం కూడా ఆ దేశానికి ఇంధనం పంపుతున్న ప్రకటనలు చేయలేదు. గతంలో భారత్ సహకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంధన దిగుమతి కోసం శ్రీలంక రష్యా సహా అనేక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నది.
