దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న వేళ వ్యాక్సిన్‌ కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. దీంతో తమకు డోసుల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి భారతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది.

వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ల దిగుమతి కోసం ఇప్పటివరకూ తమ వద్ద ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

Also Read:వ్యాక్సినేషన్ వేగవంతం: కొవాగ్జిన్ ఫార్ములా బదిలీకి కేంద్రం ఓకే..?

ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ (హెల్త్‌) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మాట్లాడుతూ... ఫైజర్‌, మోడెర్నా సంస్థలు విదేశాంగశాఖను ఇప్పటికే సంప్రదించాయి. భారత్‌లో టీకా ఉత్పత్తికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సిద్ధంగా ఉందన్నారు. ఇక, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ టీకా వినియోగానికి భారత్‌ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. మనదేశంలో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు చేరాయి. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తర్వాత పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సిద్ధమైంది.