Asianet News TeluguAsianet News Telugu

డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ టీకా 83శాతం ప్రభావవంతం: రష్యా

ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్‌ను నిలువరించడంలో స్పుత్నిక్ వీ టీకా 83శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని రష్యా వెల్లడించింది. డెల్టాతోపాటు ఇతర కరోనావైరస్ స్ట్రెయిన్‌లన్నింటిపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నదని తెలిపింది.

sputnik v 83 pc effective against delta variant says russia
Author
New Delhi, First Published Aug 11, 2021, 6:35 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేరియంట్లు ప్రపంచదేశాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కారణంగా కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. థర్డ్ వేవ్‌కూ ఇదే వేరియంట్ దోహదం చేసే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రష్యా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్పుత్నిక్ వీ టీకా డెల్టా వేరియంట్‌పై 83శాతం సమర్థంగా ఎదుర్కొంటుందని వెల్లడించింది. అంతేకాదు, ఇతర అన్ని స్ట్రెయిన్‌లపైనా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖేల్ మురష్కో విలేకరులతో మాట్లాడుతూ స్పుత్నిక్ వీ సామర్థ్యాన్ని వివరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ వీ టీకా 83శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు. సీరియస్ కరోనా కేసుల్లో దీని పనితీరు 95శాతాన్ని మించిందని తెలిపారు. కరోనా నియంత్రణ, డెల్టా వేరియంట్‌పై పోరులో నేడు స్పుత్నిక్ వీ టీకా కీలకపాత్ర పోషిస్తున్నదని రష్యా హెల్త్ మినిస్టర్ అన్నారు. తాజా ఫలితాలు మరోసారి స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యాన్ని ధ్రువీకరించాయని చెప్పారు. హాస్పిటలైజేషన్ కేసులనూ తమ టీకా గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు.

స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసిన గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలగ్జాండర్ గింట్స్‌బర్గ్ మాట్లాడుతూ తమ టీకా కరోనా వైరస్ అన్ని స్ట్రెయిన్‌లను అడ్డుకుంటుందని తెలిపారు. తమ టీకా పూర్తిగా సురక్షితమైందని, అత్యంత సమర్థవంతమైందని ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాక్సిన్ వినియోగమే తెలియజేస్తున్నదని వివరించారు. డెల్టా వేరియంట్‌పైనే కాదు, కొత్తగా ఏర్పడ్డ మరెన్నో స్ట్రెయిన్‌లనూ స్పుత్నిక్ నిలువరిస్తుందని చెప్పారు.

స్పుత్నిక్‌కు ఏడాది
స్పుత్నిక్ వీ టీకాకు అధికారికంగా గుర్తింపు లభించి ఏడాది అవుతున్నది. గతేడాది ఆగస్టు 11న తొలిసారి రష్యా ప్రభుత్వం స్పుత్నిక్ వీ టీకాను రిజిస్టర్ చేసుకుంది. కరోనా వైరస్‌‌ను నిలువరించడానికి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందిన తొలి టీకా స్పుత్నిక్ వీనే కావడం గమనార్హం. అయితే, పాశ్చాత్య దేశాల అపనమ్మకాలతో ఇతర దేశాల్లోకి స్పుత్నిక్ వీ టీకా తొలుత ఆశించిన స్థాయిలో ఎగుమతి కాలేదు. గతేడాది చివరినాటికి గాని వేరే దేశానికి వ్యాక్సిన్ ఎగుమతి కాలేకపోయింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 69 దేశాలు ఈ టీకాను ఆమోదించాయి. మనదేశంలో స్పుత్నిక్ వీ టీకా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో రష్యా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత స్పుత్నిక్ వీ టీకా డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌కే అందుబాటులోకి వచ్చింది. దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు పొందిన నాలుగు టీకాల్లో స్పుత్నిక్ వీ ఒకటి కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios