ల్యాండింగ్ సమయంలో స్సైట్ జెట్ సంస్థకు చెందిన విమానం తుఫానులో చిక్కుకుంది. దీంతో క్యాబిన్ లో ఉన్న లగేజి ప్రయాణికులపై పడింది. దాదాపు 40 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆ విమానం మరి కొద్ది సేపట్లో తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ల్యాండ్ అవడానికి సిద్ధంగా ఉంది. పైలెట్లు ల్యాండ్ అవడానికి అంతా సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో హఠాత్తుగా ఆ విమానం తుపానులో చిక్కుకుంది. దీంతో అది మొత్తం కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో దాదాపు 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ B737 (SG-945) విమానం ముంబై నుంచి పశ్చిమ బెంగాల్ కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే దుర్గాపూర్‌లోని కాజీ నజ్రుల్ ఇస్లాం విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అంతా బాగుంది అనుకొని ఆ విమానాన్ని పైలెట్లు ల్యాండ్ చేస్తున్నారు. అయితే ఒక్క సారిగా ఆ విమానం కాల్ బైసాఖి తుఫానులో చిక్కుకుంది.
దీంతో విమానం భారీ కుదుపులకు గురయ్యింది. లోపల మొత్తం అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో క్యాబిన్ లో ఉన్న లాగేజీ మొత్తం ప్రయాణికులపై పడింది. ఈ క్రమంలో దాదాపు 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఇందులో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రాణాపాయం నుంచి మాత్రం వారు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వెల్లడించాయి.
ఈ విమానం తుపానులో ఎలా చిక్కుకుపోయిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదం విషయంలో ‘ఇండియా టుడే’తో ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ‘‘ల్యాండింగ్ సమయంలో మేము మూడు కుదుపులకు గురయ్యాయి. కార్లు బంపర్‌లను ఢీకొన్నప్పుడు ఎలా అనిపిస్తుందో అచ్చం అలానే అనిపించింది. ల్యాండ్ అయ్యే సమయంలో మేము సీట్ బెల్టును పెట్టుకొని ఉన్నాము. అయితే విమానం తాకిడికి లోనవడం వల్ల బెల్ట్‌లు తెగిపోయాయి. మేము మా ముందు ఉన్న సీట్లపై పడిపోయాము.’’ అని తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఆండాల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ తపన్ కుమార్ రే మాట్లాడుతూ.. ‘‘ ఓ ప్రయాణికుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి వెన్నెముక సర్జన్‌కు రిఫర్ చేయాల్సి వచ్చింది.’’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ విమానంలోని పలువురు సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి.
