న్యూఢిల్లీ: స్పైస్ జెట్ పైలట్ కు భయంకరమైన అనుభవం ఎదురైంది. అతని కారను దాదాపు పది మంది దుండగులు ఆపి అతనిపై తుపాకి గురిపెట్టి దోచుకున్నారు. ఈ సంఘటన అర్థరాత్రి దక్షిణ ఢిల్లీలో జరిగింది. పారిపోతూ ఓ దుండగుడు అతన్ని కత్తితో పొడిచాడు. దీంతో ఢిల్లీ ఐఐటీకి సమీపంలోని ఫ్లైఓవర్ మీద పడిపోయాడు. 

రక్తం అంటిన పైలట్ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో పలువురిని ఐఐటి - ఢిల్లీ సమీపంలో ఇలాగే దోచుకున్నట్లు చెబుతున్నారు. 

స్పైస్ జెట్ పైలట్ యువరాజ్ తెవాటియా తన ఆఫీస్ కారులో తెల్లవారు జామున ఒంటి గంటకు ఫరిదాబాదులోని తన ఇంటి నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా దాడి జరిగింది. ఐఐటి ఢిల్లీ ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఐదు టూవీలర్లపై వచ్చిన పది మంది తన కారును అడ్డగించారని, రోడ్డును బ్లాక్ చేయడంతో తాను కారు ఆపాల్సి వచ్చిందని పైలట్ తన ఫిర్యాదు చెప్పారు. 

కారును చుట్టుముట్టి అద్దాలు పగులగొట్టారని, పిస్టల్ మడిమతో ఒకతను తన తలపై కొట్టాడని, తన వద్ద ఉన్న వస్తువులతో పాటు రూ.34 వేలు కూడా దోచుకెళ్లారని ఆయన తన ఫిర్యాదులో చెప్పారు. ఒకతను కత్తితో దాడి చేయడంతో కారులో రక్తమోడుతూ అతను ఉండిపోయాడు. ముఠా వెళ్లిపోయిన తర్వాత అతి కష్టం మీద పైలట్ పోలీసులకు కాల్ చేశాడు