ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్ జెట్‌కు చెందిన ఓ విమానానికి ప్రమాదం వాటిల్లింది. జమ్ము వెళ్లాల్సిన ఆ విమానం ప్యాసింజర్ టర్మినల్ నుంచి రన్ వే వైపు వెళ్తున్న క్రమంలో వెనక్కి వెళ్లింది. వెనక్కి వెళ్తుండగా కుడి వైపున ఉన్న ఓ పోల్‌ను విమానం రైట్ వింగ్ ఢీ కొట్టింది. 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ప్రమాదం చోటుచేసుకుంది. స్పైస్ జెట్‌కు చెందిన బోయింగ్ 737-800 ఎయిర్‌క్రాఫ్ట్ ఈ రోజు ప్యాసింజర్ టర్మినల్ నుంచి రన్ వే వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్పైస్ జెట్ విమానం వెనక్కి మరలుతుండగా కుడి వైపున ఉన్న ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో ఆ పోల్ వంగిపోయింది. విమానం రెక్క కూడా డ్యామేజీ అయింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ విమానం ఢిల్లీ నుంచి జమ్ముకు బయల్దేరింది. ప్రయాణికులు తమ సీటింగ్‌లో కూర్చున్న తర్వాత ఈ విమానం ప్యాసింజర్ టర్మినల్ నుంచి రన్ వే వైపు బయల్దేరుతున్న క్రమంలో విమానం వెనక్కి వెళ్లింది. వెనక్కి వెళ్తుండగా కుడి వైపు ఉన్న పోల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఆ విమానాన్ని పరీక్షించడానికి వేరే చోటుకు తీసుకెళ్లారు. ఆ విమానానికి బదులుగా మరో విమానాన్ని జమ్ము వెళ్లడానికి ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అందరినీ అందులోకి పంపించారు.

Scroll to load tweet…

ఈ ఘటనపై స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడారు. ఇవాళ స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్‌జీ 160 ఢిల్లీ నుంచి జమ్ముకు బయల్దేరాల్సిన షెడ్యూల్ ఉన్నదని వివరించారు. ఈ విమానం వెనక్కి వెళ్తుండగా రైట్ వింగ్ పోల్‌‌ను తాకిందని తెలిపారు. దీంతో ఆ వింగ్ వెనుకవైపున డ్యామేజీ అయిందని అన్నారు. దీంతో ఈ విమానం స్థానంలో మరో విమానాన్ని జమ్ము వెళ్లడానికి ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ టేకాఫ్ కావడానికి ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆ శబ్దానికి స్థానికులు, విమానంలో చిన్నపాటి కుదుపు రావడంతో ప్రయాణికులూ కొంత ఆందోళన పడ్డట్టు తెలుస్తున్నది.