సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. అందరూ సొంత ఊళ్లు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. అందుకే.. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కోయంబత్తూరు మార్గంలో చెన్నై సెంట్రల్‌ -ఎర్నాకుళం మధ్య సువిధ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ రైల్వే నిర్ణయించింది. 

ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 11వ తేదీ రాత్రి 8.30 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు అరక్కోణం, కాట్పాడి, సేలం, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌ మార్గంగా మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు ఎర్నాకుళం చేరుతుంది. అలాగే ఎర్నాకుళం నుంచి జనవరి 10వ తేదీన సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. 

అలాగే ఫిబ్రవరి 1 నుంచి 22వ తేదీ వరకు ప్రతి శుక్రవారం చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 8.30 గంటలకు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఎర్నాకుళం నుంచి రాత్రి 7.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు సోమవారం ఉదయం 7.20కి చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఇప్పటికే రిజర్వేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని రైల్వే ప్రకటనలో సూచించింది.