బీజేపీ ఎంపీ రమాదేవిపై తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు. తాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహారించానని ఆజంఖాన్ తెలిపారు.

తనకు చట్టపరమైన అంశాల గురించి తెలుసునని.. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవర్నైనా బాధించి వుంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆజంఖాన్ పేర్కొన్నారు.

ఈ ఘటన తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. సభ్యులు ప్రసంగించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని.. ఇలాంటి అనుచిత పదాలు ఉపయోగించకుండా సభా మర్యాదను కాపాడాలని కోరారు.

కాగా.. ఆజంఖాన్ క్షమాపణలు తాను అంగీకరించనన్నారు బీజేపీ ఎంపీ రమాదేవి. ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారని.. ఇటువంటి మాటలు వినడానికి తాను లోక్‌సభకు రాలేదని రమాదేవి స్పష్టం చేశారు.     

సోమవారం లోక్‌సభ ప్రారంభానికి ముందు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆజమ్‌ఖాన్‌లు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కలిశారు. కాగా ... లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్... డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర పార్టీల మహిళా ఎంపీలు ఆజంఖాన్‌పై మండిపడ్డారు.