న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు గురువారం నాడు కేరళలోకి ప్రవేశించాయి. రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి రుతుపవనాలు  వచ్చాయని ఐఎండీ  తెలిపింది. ఈ నెల 1వ తేదీనే కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే రెండు రోజలు ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి.  నాలుగు మాసాల్లో నైరుతి పవనాలతో దేశంలో వర్షాలు కురుస్తాయి. 

నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో  వర్షాలు కురుస్తున్నాయి.   రెండు రోజుల్లో దక్షిణ భారత్‌లోని ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  ఈ నెల 4 నుండి 6 వ తేదీ వరకు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఇవాళ్టి నుండి అస్సాం, మేఘాలయలో ,ఈ నెల 5 , 6 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్,మిజోరం, త్రిపురలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే  ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా  వేస్తున్నారు.