దశాబ్ధకాలంతో పోలిస్తే.. ప్రస్తుతం అన్నింటి విలువ బాగా పెరిగిపోయింది. తినే తండి నుంచి తాగే నీరు వరకు అన్నింటి రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇళ్లు కొనడం, కట్టడం, స్థలం కొనడం లాంటివి మద్యతరగతి కుటుంబీకులకు మరింత కష్టమే. కాగా... మన దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాన్ని తాజాగా కనుగొన్నారు. టాప్ టెన్ కాస్ట్ లీయెస్ట్ ప్రాంతాల జాబితాను విడుదల చేయగా... అందులో మొదటి మూడు ముంబయిలోనే ఉండటం గమనార్హం.

దక్షిణ ముంబయిలోని తార్ దేవ్ రోడ్ దేశంలో అత్యతం ఖరీదైన నివాస ప్రాంతంగా గుర్తించారు. ఇక్కడ చదరపు అడుగు స్థలం సగటు ధర రూ.56,200 పలుకుతోంది. ఇక్కడ విలాసవంతమైన నివాస భవనాలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆస్పత్రులు, పాఠశాలలు, హోటల్స్ ఉండటమే అందుకు కారణమని చెబుతున్నారు.

స్థిరాస్తి వ్యాపారులు కొత్తగా సేకరించిన స్థలాల్లో నిర్మించిన ఇళ్ల ధరలనే ఈ సర్వేలో పరిగణలోకి తీసుకున్నారు. తొలి స్థానంలో ముంబయిలోని తారాదేవ్ రోడ్ ఉండగా... రెండో స్థానంలో ముంబయిలోని వర్లి ప్రాంతం ఉంది. ఇక మూడో స్థానంలో ముంబయిలోని మహాలక్ష్మి ప్రాంతం, నాలుగో స్థానంలో చెన్నైలోని నుంగంబాక్కం, ఐదో స్థానంలో చెన్నైలోని ఎగ్మోర్, ఆరో స్థానంలో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతం, ఏడో స్థానంలో చెన్నైలోని అన్నానగర్, ఎనిమిదో స్థానంలో పూణేలోని కోరేగాం పార్క్, తొమ్మిదో స్థానంలో గుడ్ గాంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్, పదో స్థానంలో కోల్ కతాలోని అలీపూర్ ఉంది. ఈ మొదటి పది స్థానాల్లో హైదరాబాద్ లేకపోవడం గమనార్హం.