Asianet News TeluguAsianet News Telugu

పారాగ్లైడింగ్ లో విషాదం.. గుజరాత్‌లో దక్షిణకొరియా వాసి దుర్మరణం

పారాగ్లైడింగ్‌ చేస్తుండగా ప్రమాదం సంభవించి ఓ దక్షిణ కొరియా వాసి దుర్మరణం పాలయ్యాడు. సరైన సమయంలో పారాగ్లైడర్‌ తెరుచుకోకపోవడంతో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ ప్రమాదం గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. 

South Korean Man, 50, Dies After Paraglider Fails To Open In Gujarat
Author
First Published Dec 25, 2022, 11:01 PM IST

పారాగ్లైడింగ్ అనేది ఒక ఆహ్లాదకరమైన, సాహసోపేతమైన క్రీడ. ఇందులో లైట్ ఫాబ్రిక్ వింగ్ జతచేయబడి ఉంటుంది. పైలట్ ఈ ఫాబ్రిక్ వింగ్ కింద కూర్చుని టేకాఫ్ చేస్తాడు. పారాగ్లైడర్ వందల కిలోమీటర్ల దూరాన్ని గంటల తరబడి ప్రయాణించగలదు. అయితే.. దీనికి కూడా చాలా జాగ్రత్త అవసరం. గ్లైడింగ్ చేసే సమయంలో తాడు తెగిపోతే.. ఆ వ్యక్తి ప్రాణాలే ముప్పు వాటిల్లుతుంది. తాజాగా గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో అలాంటి ఘటన ఒకటి తెర మీదికి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ చేస్తూ పడి దుర్మరణం పాలయ్యాడు. 

జిల్లాలోని కడి పట్టణ సమీపంలోని విసత్‌పురా గ్రామంలోని పాఠశాల మైదానంలో శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ సరిగా తెరుచుకోకపోవడంతో షిన్ బయోంగ్ మూన్ (50) అనే వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి 50 అడుగుల ఎత్తు నుంచి నేలపై పడి మృతి చెందాడని కడి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నికుంజ్ పటేల్ తెలిపారు.

కింద పడిపోవడంతో స్పృహతప్పి పడిపోయాడని, వెంటనే ఆ వ్యక్తిని అతని స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే  ఆ వ్యక్తి  మృతి చెందాడని తెలిపారు. ఎత్తు నుంచి కింద పడిన షాక్‌తో   ఆ వ్యక్తి కి గుండెపోటు వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి మూన్.. దక్షిణ కొరియా నుంచి భారత్ పర్యటనకు వచ్చాడు. అతని స్వదేశీ స్నేహితులు విసత్‌పురాకు ఒక పరిచయస్థుడి వద్దకు వచ్చారు. శనివారం సాయంత్రం మూన్, అతని స్నేహితులు పారాగ్లైడింగ్‌కు వెళ్లారు. 

మృతదేహాన్ని దక్షిణ కొరియాకు పంపనున్నారు

పారాగ్లైడర్ సరిగ్గా తెరుచుకోలేదని, ఆ తర్వాత ఆ వ్యక్తి దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశామని, మృతుడి ( మూన్) బంధువులు, స్నేహితులకు, ఘటనపై కొరియన్ ఎంబసీకి సమాచారం అందించామని తెలిపారు. మృతదేహాన్ని దక్షిణ కొరియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పారాగ్లైడింగ్ బద్దలు కొట్టి పడి ఉంది. అదే సమయంలో, ఒక కొరియన్ పౌరుడి మృతదేహం కూడా దాని పక్కన పడి ఉంది. 

హిమాచల్ ప్రదేశ్‌లో..

ఇంతకుముందు పారాగ్లైడింగ్ సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో కూడా పెద్ద ప్రమాదం జరిగింది. పారాగ్లైడర్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సమాచారం ప్రకారం.. కులులో ఇద్దరు వ్యక్తులు పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు, వాతావరణం చెడుగా మారింది. అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. పైలట్ విజయవంతంగా టేకాఫ్ తీసుకున్నప్పటికీ, బలమైన గాలి కారణంగా వారు నియంత్రణ కోల్పోయాడు. దీంతో పారాగ్లైడర్ అదుపుతప్పి కుప్పకూలింది. టూరిజం శాఖ కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.

12 ఏళ్ల బాలుడు మృతి

ఈ ఏడాది జనవరిలో బిర్ బిల్లింగ్ పారాగ్లైడింగ్ సైట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పారాగ్లైడింగ్ సహా పలు సాహస క్రీడలను నిషేధించింది. హిమాచల్‌లోని అన్ని సాహస క్రీడలను పర్యవేక్షించేందుకు హైకోర్టు ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో, చాలా మంది ఆపరేటర్ల రిజిస్ట్రేషన్లు చెల్లవని , అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు ఉపయోగించే చాలా పరికరాలు కూడా ప్రామాణికంగా లేవని కనుగొనబడింది. ఆ తర్వాత అన్ని ప్రమాణాలను పూర్తి చేయగల ఆపరేటర్లు మాత్రమే ఏప్రిల్‌లో కార్యాచరణను ప్రారంభించడానికి అనుమతించబడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios