కోల్ కతా: బిసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బిజెపి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోరులో బిజెపి తురుపు ముక్కగా వాడబోతుందనే ప్రచారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధంకర్ తో గంగూలీ ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన గవర్నర్ తో చర్చలు జరిపారు. దీంతో ఆ ప్రచారం తెర మీదికి వచ్చింది. 

గవర్నర్ తో తన భేటీపై పుకార్లు వద్దని, తాను మర్యాదపూర్వకంగానే కలిశానని గంగూలీ అన్నారు. ఇప్పటి వరకు గవర్నర్ ఈడెన్ గార్డెన్ ను చూడలేదని ఆయన చెప్పారు. నిరుడు జులైలో గవర్నర్ వచ్చారని, ఆయన ఈడెన్ గార్డెన్ ను సందర్శించాలని అనుకుంటున్నారని, అందుకే తాను కలిశానని ఆయన చెప్పారు. 

ప్రాక్టీస్ జరుగుతున్నందున ఈ రోజు చూడడం కుదరదని తాను చెప్పానని, వచ్చే వారం తాను మళ్లీ వచ్చి ఈడెన్ గార్డెన్ కు స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పానని గంగూలీ వివరించారు. 

గంగూలీతో భేటీకి సంబంధించిన ఫొటోలను జగ్ దీప్ దింకర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. దాదాతో ఈ రోజు భేటీ జరిగిందని, వివిధ విషయాలపై చర్చించామని ఆయన అన్నారు. దేశంలో మొట్టమొదటి క్రికెట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్ ను చూడడానికి రావాల్సిందిగా ఆహ్వానించారని ఆయన అన్నారు. 

 

దాదాతో గవర్నర్ భేటీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేడి పుట్టించింది. పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి భూమిపుత్రుడే అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 19, 20 తేదీల్లో పశ్చిమ బెంగాల్ పర్యటించిప్పుడు చెప్పారు. అంతకు మించి ఆయన వివరాలు ఇవ్వలేదు.

ఈ స్థితిలో గంగూలీని తమ పార్టీ తరఫున ఎన్నికల సమరంలోకి దింపాలని బిజెపి యోచిస్తున్నట్లు ప్రచారం సాుగోతంది.  సౌరవ్ గంగూలీ బిజెపి లో చేరుతున్నారని, దానివల్ల బిజెపికి ఎంతో బలం చేకూరుతుందని 2015 జనవరిలో ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేసినప్పుడు కూడా అటువంటి ప్రచారమే సాగింది. అయితే, ఆ వ్యాఖ్యలను గంగూలీ కొట్టిపారేశారు.