Asianet News TeluguAsianet News Telugu

సోనూ సూద్ రూ. 20 కోట్ల పన్ను ఎగవేశాడు: తనిఖీల తర్వాత ఐటీ శాఖ వెల్లడి

సహాయానికి చిరునామాగా నిలిచిన సోనూ సూద్ రూ. 20 కోట్ల పన్ను ఎగవేసినట్టు ఐటీ శాఖ తాజాగా వెల్లడించింది. ముంబయిలోని ఆయన నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఐటీ అధికారులు మూడు రోజులపాటు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. నెటిజన్లు, ఆయన అభిమానులు ఈ తనిఖీలపై మండిపడ్డారు.
 

sonu sood evaded nearly 20 crore tax says IT department
Author
New Delhi, First Published Sep 18, 2021, 1:07 PM IST

న్యూఢిల్లీ: యాక్టర్, యాక్టివిస్ట్ సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఐటీ శాఖ మూడు రోజులుగా తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల తర్వాత సోనూ సూద్‌పై సంచలన ప్రకటన చేసింది. ఆయన రూ. 20 కోట్ల పన్ను ఎగవేసినట్టు వెల్లడించింది. అంతేకాదు, సోనూ సూద్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ కూడా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత చట్టాన్ని ఉల్లంఘిస్తూ రూ. 2.1 కోట్ల డబ్బును పోగు చేసిందని వివరించింది.  ఫారీన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్‌ను ఆయన స్వచ్ఛంద సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది.

‘యాక్టర్ సోనూ సూద్, ఆయన అసోసియేట్లకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేసినప్పుడు సోనూ సూద్ పన్ను ఎగవేసినట్టు ఆధారాలు లభించాయి. బోగస్ కంపెనీల నుంచి బోగస్ లోన్‌ల రూపంలో సోనూ సూద్ లెక్కలో లేని ఆదాయాన్ని పొందే విధానాన్ని ఆయన అనుసరించాడు’ అని ఆదాయపన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు అలాంటి 20 బోగస్ సంస్థల నుంచి డబ్బు పొందినట్టు తేలిందని, తమ విచారణలో సొమ్ము అందించినవారూ దీన్ని అంగీకరించారని ఐటీ శాఖ తెలిపింది. డబ్బుకు బదులు చెక్‌ను అందజేసినట్టు ఒప్పుకున్నారని వివరించింది. పన్ను ఎగ్గొట్టడానికి ప్రొఫెషనల్ రశీదులను లోన్‌లుగా అకౌంట్ బుక్‌లలో పొందుపరుస్తున్న ఘటనలు గతంలో వెలుగుచూశాయని పేర్కొంది. బోగస్ లోన్‌లను పెట్టుబడులు సమీకరించడానికి, ఆస్తులు కూడబెట్టడానికి ఉపయోగించినట్టు తెలిసిందని వివరించింది. ఇప్పటి వరకు పన్ను ఎగ్గొట్టిన మొత్తాన్ని రూ. 20 కోట్లకుపైగానే అని తేల్చినట్టు వెల్లడించింది.

కరోనావైరస్ తొలి వేవ్ సమయంలో సోనూ సూద్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ సూద్ చారిటీ ఫౌండేషన్ ఈ ఏడాది ఏప్రిల్ వరకు 18 కోట్ల విరాళాలను సేకరించిందని, ఇందులో రూ. 1.9 కోట్లను సహాయక చర్యల కోసం వెచ్చించారని, సుమారు రూ. 17 కోట్లు ఇంకా ఆ సంస్థ బ్యాంక్ ఖాతాలో నిరుపయోగంగా ఉన్నాయని కొన్ని ఆరోపణలు వచ్చాయి.

సోనూ సూద్ ఇటీవలే లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో డీల్ చేసుకున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ పరిశీలిస్తున్న ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సోనూ సూద్ ఆస్తులపైనా ఐటీ శాఖ తాజాగా తనిఖీలు చేసింది. ఆ లక్నో కంపెనీకి చెందిన ఆస్తులపైనా తనిఖీలు చేయగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ తెలిపింది. బోగస్ బిల్లింగ్‌లు చేసిందని, రూ. 65 కోట్ల విలువ చేసే బోగస్ కాంట్రాక్టులకు సంబంధించిన ప్రూఫ్‌లు దొరికాయని వివరించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూ సూద్ ఇటీవలే సమావేశమైన తర్వాత ఆయన రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా తనిఖీలు జరిగాయి. ఈ విషయాన్ని పేర్కొంటూ శివసేన, ఆప్ పార్టీలు కేంద్రంపై విమర్శలు చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios