న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగనున్నారు. ఎఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకు సోనియాగాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతారు.

సీడబ్ల్యుసీ మీటింగ్ సోమవారం నాడు 7 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ లో జరిగింది. పార్టీ సీనియర్లు సోనియాగాంధీకి రాసిన లేఖపై రాహుల్ గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కాంగ్రెస్ సీనియర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో కుమ్మకైనట్టుగా తమపై చేసిన ఆరోపణలపై  కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని సోనియాగాంధీ ప్రకటించారు. తన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాలని కూడ ఆమె సమావేశంలో సూచించారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాజీ మంత్రి ఏకే ఆంటోనీలు సోనియా గాంధీకి మద్దతుగా నిలిచారు.  సీడబ్ల్యుసీ సమావేశంలో ఆజాద్ పై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 

ఈ విషయమై పార్టీ నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో చోటు చేసుకొన్న పరిస్థితులపై కూడ సమావేశంలో లోతుగా చర్చించారు.సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేవరకు పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొంది.

ఇవాళ ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.