National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మూడువారాలు గడువు అడిగినట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసిన మరుసటి రోజే సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోరింది. తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, మరో కొన్ని రోజుల సమయం కావాలని కోరారు. గత వారం COVID-19 బారిన పడిన సోనియా గాంధీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చిక్సిత పొందుతున్నారు.
అయితే.. తనకు ఇంకా కరోనా వైరస్ నెగెటివ్ రాలేదని, ఐసోలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సోనియా గాంధీ ఈడీకి తెలియజేసింది. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో జూన్ 2, జూన్ 7 నాటి వైద్య నివేదికలు కూడా EDకి పంపించారు. మరో మూడు వారాలు గడువు కావాలని ఈడీని సోనియాగాంధీ కోరినట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు విషయంలో జూన్ 8 న సోనియా గాంధీ, తన కుమారుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ED ముందు హాజరు కావాల్సి ఉండే.. పలు కారణాలతో ఇద్దరు నేతలు హాజరు కాలేకపోయారు.
ఇదిలా ఉండగా.. జూన్ 13న రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరుకానున్నారు. తొలుత ఈ కేసు విచారాణలో జూన్ 8న పాల్గొనాల్సిందిగా ఆయనకు ముందుగా సమన్లు అందాయి, అయితే.. తాను విదేశాల్లో ఉన్నందున ఆ సమయానికి విచారణకు హాజరుకాలేనని ఈడీని కోరడంతో.. తాజాగా జూన్ 13న విచారణలో పాల్గొనేందుకు గడువు ఇచ్చారు. అయితే.. జూన్ 13న రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు .. కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తోంది. రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలకు కూడా ఈడీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లనున్నట్టు సమాచారం.
నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటీ?
నేషనల్ కాంగ్రెస్ లోని కొంతమంది నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో కథనాలను స్ఫూర్తిదాయక కథనాలను అందించి స్వాతంత్య్ర కాంక్షను రేపింది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ప్రజల్లో ఓ ముద్ర పడింది. అలాగే.. స్వాతంత్య్రం అనంతరం ఈ న్యూస్ పేపర్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నని రోజురోజులు లాభాల బాటలో ఉన్న పత్రిక.. అనంతరం తీవ్ర నష్టాల పాలైంది. ఈ క్రమంలో 2008లో ఈ పేపర్ ను మూసివేశారు.
పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు తక్కువ మొత్తానికే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియా లిమిటెడ్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. కేవలం రూ.50 లక్షల చెల్లించి ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది.
ఇది రాజకీయ ప్రతీకారమని, కేసు దర్యాప్తుకు ఎటువంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సాల్‌లను ప్రశ్నించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కాంగ్రెస్ నేతలిద్దరి వాంగ్మూలాలను ఏజెన్సీ నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్‌ను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురించింది మరియు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) యాజమాన్యంలో ఉంది. ఖర్గే వైఐఎల్ సీఈఓగా ఉండగా, బన్సాల్ ఏజేఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.YIL ప్రమోటర్లలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు.
