కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె కొన్ని నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నది. 2020 అక్టోబర్ నుంచి ఢిల్లీలోని 10 జన్‌పథ్ అద్దె చెల్లించలేదని ఆర్టీఐ సమాధానాలు వెల్లడించాయి. అంతేకాదు, కాంగ్రెస్‌కు చెందిన సంస్థ సేవా దళ్ హెడ్‌క్వార్టర్, ఈ పార్టీకి కేటాయించిన మరో భవనం అద్దె కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి అద్దెలు కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Congress interim president Sonia Gandhi) 2020 అక్టోబర్ నుంచి తన అధికారిక నివాస భవనం (Official Residence) అద్దె చెల్లించలేదు. ఢిల్లీలోని ఈ 10 జన్‌పథ్‌ (10 Janpath) నెలవారీ అద్దె రూ. 4,610. ఈ వివరాలు ఆర్టీఐ సమాధానంలో వెల్లడయ్యాయి. వీటిని కొందరు బీజేపీ నేతలు సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేశారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అధికారిక నివాసం తోపాటు కాంగ్రెస్‌కు చెందిన సంస్థ సేవా దళ్, ఈ సంస్థ సిబ్బంది కోసం తీసుకున్న మరో కార్యాలయ అద్దె కూడా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్టు ఆ ఆర్టీఐ వెల్లడించింది. వీటి అద్దె బకాయిలు కోట్లకు చేరడం గమనార్హం. ఈ భవనాల అద్దెతోపాటు డ్యామేజీ చార్జీలూ చెల్లించాల్సి ఉన్నట్టు తెలిసింది.

సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్‌పథ్ అద్దె రూ. 4,610 ఉండగా, అక్బర్ రోడ్ 26లోని సేవా దళ్ హెడ్‌ క్వార్టర్ అద్దె రూ. 12.7 లక్షలు. చాణక్య పురిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన మరో భవంతి నెలవారీ అద్దె రూ. 5.08 లక్షలుగా ఉన్నది. సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్‌పథ్ అద్దె 2020 అక్టోబర్ నుంచి ఇంకా కట్టలేదు. కాగా, అక్బర్ రోడ్ 26లోని భవంతి అద్దె 2012 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ చెల్లించలేదు. అలాగే, చాణక్యపురిలోని భవనం అద్దెను 2013 ఆగస్టు నుంచి పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆర్టీఐ సమాధానాలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉండగా, తెలంగాణలో గతేడాది నవంబర్‌లో ప్రభుత్వ కార్యాలయ భవనం అద్దె కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన భవనానికి రావాల్సిన అద్దె చెల్లించేంతవరకు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలో (karimnagar district) నూతన మండలాల ఆవిర్భావంలో భాగంగా గన్నేరువరం (ganneruvaram) మండలాన్ని అధికారులు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ప్రైవేట్ భవనాల్లో ఆఫీసులు నెలకొల్పారు. ఇందులో భాగంగా గన్నేరువరం ఎంపీడీవో కార్యాలయం కోసం 2019 జులైలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ. 12,500 చొప్పున కిరాయి ఇచ్చేందుకు అధికారులు .. ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నారు. 

అప్పటినుండి ఇప్పటివరకు 29 నెలలు గడవగా 11 నెలల కిరాయి మాత్రమే ఇచ్చారని మిగతా కిరాయి ఇవ్వడం లేదని ఇంటియజమాని తిరుపతి వాపోయారు. అద్దె చెల్లించాలని అడుగుతుంటే అధికారులు రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అద్దె రూపంలో రూ. 2.25 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు లోను తీసుకుని భవనాన్ని కట్టించానని, నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకూ ఎంపీడీవో కార్యాలయ తాళం తీసేది లేదని ఆయన తేల్చిచెప్పాడు.