న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలు,కరోనా నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారు.

సోనియాగాంధీ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉండడంతో రాహుల్ గాంధీతో కలిసి ఆమె కొన్ని రోజుల క్రితం గోవాకు వచ్చారు.కరోనాతో పాటు రైతుల ఆందోళనల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని  సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారని  ఆ పార్టీ వర్గాలు తెలిపాయి,

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీలో 13 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు సంఘాలతో కేంద్ర చర్చలు విఫలమయ్యాయి. మరోసారి రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చించే అవకాశం ఉంది.సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని  ఎలాంటి వేడుకలను నిర్వహించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు లేఖ రాశాడు.

కేక్ కట్ చేయడం, సంబరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆ లేఖలో ఆయన పార్టీ నేతలను కోరారు.రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ పుట్టిన రోజు.