నేషన‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే దాదాపు రెండు గంటల విచారణ తర్వాత సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. 

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు కొద్దిసేపటి క్రితం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. నేషన‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు సహకారంగా ఉండేందుకు ప్రియాంక గాంధీకి ఈడీ అనుమతించింది. సోనియాను ప్రశ్నించే గదికి దూరంగా ఉన్న భవనంలో ప్రియాంక గాంధీ ఉండడానికి ఈడీ అధికారులు అనుమతించారు. తద్వారా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ప్రియాంక తన తల్లి వద్దే ఉండి ఆమెకు మందులు అందించవచ్చని అధికారులు తెలిపారు.

సోనియాను యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కంపెనీలో అవకతవకల ఆరోపణలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండు గంటల విచారణ తర్వాత సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీసు నుంచి తన నివాసానికి వెళ్లారు. దీంతో సోనియా గాంధీ తొలి రోజు విచారణ ముగిసింది. అయితే మరోసారి ఆమెను ఈడీ అధికారులు విచారణకు పిలుస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


ఇక, సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోనియా ఈడీ విచారణకు వెళ్లొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. సోనియా గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకు తొలగించి సోనియా గాంధీ వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. సోనియా గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో రైళ్లను అడ్డుకున్నారు. 

ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘అధికార పార్టీ వారు ఎంత శక్తివంతంగా ఉన్నారో చూపించాలనుకుంటున్నారు. మేము ద్రవ్యోల్బణం సమస్యను పార్లమెంటులో లేవనెత్తాము.. కానీ వారు చర్చకు సిద్ధంగా లేరు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని మేం ఇప్పుడు లేవనెత్తుతున్నాం’’ అని అన్నారు. 

 మరోవైపు ఇదే కేసుకు సంబంధించి రాహుల్ గాంధీని గత నెలలో ఈడీ సుదీర్ఘంగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. పలు దఫాలుగా 5 రోజుల పాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇప్పుడు సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్న సమయంలో అదే తరహాలో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

మోదీ సర్కార్ ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం పార్లమెంట్ హౌస్ సమీపంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. ఈడీని దుర్వినియోగం చేయడం మానేయండి అంటూ బ్యానర్‌ను ప్రదర్శించారు. అనంతరం వారు పార్లమెంట్ నుంచి 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌కు బయలుదేరారు.