Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. నేడు రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. 

sonia gandhi Joins in rahul gandhi bharat jodo yatra
Author
First Published Oct 6, 2022, 9:40 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. గురువారం ఉదయం మాండ్యా జిల్లా పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి ప్రారంభించారు. రాహుల్ పాదయాత్ర జకన్నహళ్లి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో సోనియా కలిసి నడిచారు. అయితే దాదాపు 15 నిమిషాల పాటు రాహుల్, పార్టీ నాయకులతో కలిసి నడిచిన తర్వాత.. రాహుల్ కోరడంతో ఆమె కారులో యాత్రను ఫాలో అవుతున్నట్టుగా తెలస్తోంది.

అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేకపోయారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే పార్టీ బహిరంగ కార్యక్రమంలో గాంధీ పాల్గొని చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో.. కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. 

 


ఈ రోజు రాహుల్ పాదయాత్ర నాగమంగళ తాలూకాలోని బ్రహ్మదేవరహళ్లి‌లో ముగియనుంది. అక్కడే బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. నాగమంగళ తాలూకాలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా ఉన్న మడకె హోసూరు గేటు వద్ద రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రాత్రి స్టే చేయనున్నారు. 

రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు సోనియా గాంధీ.. అక్టోబర్ 3వ తేదీన కర్ణాటకకు చేరుకన్న సంగతి తెలిసిందే. మైసూరు సమీపంలోని కబినిలోని రిసార్ట్‌లో సోనియా గాంధీ రెండు రోజులు స్టే చేశారు. బుధవారం దసరా సందర్భంగా ఆమె మైసూర్‌ జిల్లాలోని హెచ్‌డీ కోట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బేగూర్ గ్రామంలోని భీమనకొల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక, నేడు ఉదయం తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు పార్టీ  నాయకులు, కార్యకర్తలతో ఆమె కలిసి నడుస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళలో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్..  గత శుక్రవారం కేరళ సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios