Asianet News TeluguAsianet News Telugu

మరోసారి ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. 

Sonia Gandhi Appear before ED one more time Rahul Gandhi detained during protest
Author
First Published Jul 26, 2022, 1:07 PM IST

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని పలు దఫాలుగా ఐదు రోజులు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఇక, గురువారం రోజున సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే మరోమారు జూలై 25న విచారణకు రావాల్సిందిగా ఈడీ శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే విచారణను ఒకరోజు వాయిదా పడింది.  

ఈ క్రమంలోనే తాజాగా నేడు(జూలై 26) మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యరు.  తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రియాంక గాంధీ.. ఈడీ కార్యాలయంలోనే మరోక బిల్డింగ్‌లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. 

అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, పలువురు ఎంపీలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో..  రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణికం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హితో పాటుగా పలువురు ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఎంపీలందరూ ఇక్కడికి వచ్చారు. వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడారు. మమ్మల్ని ఇక్కడ కూర్చోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. (పార్లమెంట్) లోపల చర్చలకు అనుమతి లేదు. ఇక్కడ వారు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు’’ అని అన్నారు. ‘‘భారతదేశం ఒక పోలీసు రాజ్యం, ప్రధాని నరేంద్ర మోదీ ఒక రాజు’’ అని రాహుల్ కామెంట్ చేశారు.

మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇక, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం.. అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లకు తమ రాజధాని నగరంలోని ఏదైనా గాంధీ విగ్రహం వద్ద లేదా, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేపట్టాలని అభ్యర్థించారు.

Follow Us:
Download App:
  • android
  • ios