కర్నాటక, గోవాలలో రాజకీయ సంక్షోభంతో పాటు తమ ఎమ్మెల్యేలను  బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. కన్నడ నాట పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూనే.. పార్లమెంట్ సాక్షిగా ఆందోళనకు సిద్ధమైంది. ఇప్పటికే లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తుండగా .... గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనకు దిగారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు గాంధీ విగ్రహం వద్ద బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోంని నేతలు మండిపడ్డారు. దేశంలోని బీజేపీయేతర పక్షాలను కూలగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు.  మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపిస్తున్నామన్న ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. సంకీర్ణానికి సంఖ్యాబలం లేదని.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇక్కడ పరిస్ధితి ఇలా ఉండగానే.. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో వీలినమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ కాంగ్రెస్‌ సభ్యుల బలం 5కు పడిపోయింది