కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు. వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ సమయంలో డాక్టర్లు.. దేవుళ్లలాగా మారి.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా సేవ చేస్తున్నారు. అలాంటి డాక్టర్లను గౌరవించాల్సింది పోయి.. కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూరులో కరోనా రోగి బంధవులు డాక్టర్‌పై దాడి చేసి అతనిని కత్తితో పొడిచారు. కరోనా సోకిన ఒక వృద్ధ మహిళను లాతూర్‌లోని ఆల్ఫా సూపర్‌ స్పెషలిటీ హాస్పటల్‌లో చేర్పించారు. ఆమె వయసు  రీత్యా కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నాయని  డాక్టర్లు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి తరుపు బంధువులు అభ్యర్థించారు. 

కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో గొడవ చేసిన రోగి బంధువులు దినేష్‌ వర్మ అనే డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్‌ ఆసోసియేషన్‌ సీరియస్‌గా తీసుకుంది. దాడి చేసిన  వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది.