ముంబై:కరోనాతో ఇబ్బంది పడుతున్న తండ్రిని చూసి తట్టుకోలేక  వైద్యమైనా చేయండి లేదా ఇంజక్షన్ ఇచ్చి తన తండ్రిని చంపేయాలని  ఓ కొడుకు  కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది.మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన సాగర్ కిషోర్ అనే వ్యక్తి  తండ్రికి కరోనా సోకింది.  ఈ వైరస్ కారణంగా ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.

 దీంతో చంద్రాపూర్ ఆసుపత్రికి చికిత్స కోసం సాగర్ తన తండ్రిని తీసుకొచ్చాడు. అక్కడే కరోనా రోగులు చికిత్స కోసం బారులు తీరారు. దీంతో 24 గంటల పాటు ఆసుపత్రులను మూసివేశారు.  ఇక చేసేదీలేక వరోరా ఆసుపత్రికి అక్కడి నుండి చంద్రాపూర్ లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాను, అక్కడి నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా కూడ ప్రయోజనం లేదన్నారు సాగర్.

దీంతో సమీపంలోని తెలంగాణలోని ఆసుపత్రికి తరలించి తన తండ్రికి చికిత్స అందించాలని  సాగర్ భావించాడు. తెలంగాణకు వచ్చినా కూడ  ఇక్కడ కూడ అదే పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో తోచక తిరిగి చంద్రాపూర్ కు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు, వైద్య సహాయం అందక అంబులెన్స్ లో ఇబ్బంది పడుతున్న తన తండ్రి బాధన చూసి తట్టుకోలేక సాగర్ కన్నీరుమున్నీరుగా విలపించారు.తన తండ్రికి వైద్య సహాయం అందించి కాపాడండి లేదా ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి  చంపేయాలని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.  దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు సృష్టించింది.