కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి.. పెద్ద చేసి.. ఉన్నత చదవులు చదివించి.. భవిష్యత్తు బంగారు మయం చేశాడు ఆ తండ్రి. కానీ.. ఆ కొడుకు మాత్రం.. తండ్రి పట్ల నిర్దయగా ప్రవర్తించాడు. కనీసం తండ్రిచనిపోయిన తర్వాత కూడా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేశాడు. కరోనాతో తండ్రి చనిపోతే.. శవాన్ని కూడా వెంట తీసుకువెళ్లడానికి అంగీకరించలేదు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చామరాజపేటకు చెందిన కే.సీ.కుమార్‌ (63) అనే వ్యక్తి నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో కరోనా జబ్బుతో చేరారు. జులై 13న పరిస్థితి విషమించి మరణించాడు. తండ్రి మృతదేహం తీసుకోవాలని ఆయన కుమా­రునికి ఆస్పత్రి సిబ్బంది అనేకసార్లు ఫోన్లు చేశారు. వారం రోజులైనా జాడలేదు. కొడుకు వస్తాడేమోనని ఆస్పత్రి సిబ్బంది అప్పటినుంచే మార్చురిలో భద్రపరిచారు. 

ఇటీవల వెళ్లిన తనయుడు ఆస్పత్రి ఫీజులు చెల్లించి, తండ్రి మృతదేహం తనకు వద్దని చెప్పేసి వెళ్లిపోయాడు. ఆస్పత్రి ఫోన్‌ నంబర్లను కూడా బ్లాక్‌ చేశాడు. చివరకు ఆస్పత్రి సిబ్బంది పాలికె సహకారంతో ఆ అభాగ్యుని అంత్యక్రియలను జరిపించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.