శోభనం.. స్త్రీ, పురుషుల జీవితంలో తియ్యటి జ్ఞాపకం.. వయసులోకి వచ్చిన నాటి నుంచే దీని గురించి యువతలో ఎన్నో కలలు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న ఆ రోజు రానే వచ్చింది.. జీవిత భాగస్వామితో ఎన్నో ఊసులు చెప్పాలని భావించిన ఓ వ్యక్తికి తండ్రి ఆటంకం కలిగించడంతో ఆగ్రహంతో నాన్ననే హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం అరియలూరు జిల్లా జయంకొండం సమీపంలోని ఆదిచ్చనల్లూరు గ్రామానికి చెందిన షణ్ముగం తన కుమారుడు ఇళమదికి శుక్రవారం పెళ్లి చేశాడు.

ఆ రోజు రాత్రి అతనికి శోభనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో బంధువులందరూ వెళ్లిపోయారు. వరుడి కుటుంబసభ్యులు, కొంతమంది దగ్గరి బంధువులు ఉన్నారు.

అయితే ఈ సమయంలో షణ్ముగం తన కుమారుడు ఇళమదిని పిలిచాడు. పెళ్లి ఖర్చులు చూడాలని, చదివింపులు ఎంత వచ్చిందో పోయి నగదు  తీసుకురమ్మని చెప్పారు. ఆ సమయంలో ఇళమది మొదటి రాత్రికి సిద్ధమవుతున్నాడు.

వధువు సైతం శోభనపు గదికి వెళ్లింది. దీనిని ఏమాత్రం పట్టించుకోని షణ్ముగం తనకు లెక్కలు చెప్పి శోభనపు గదిలోకి వెళ్లాలని కొడుకుకు గట్టిగా చెప్పాడు. ఇప్పుడెందుకు ఉదయాన్నే లెక్కలు చూసుకుందామని చెప్పినప్పటికీ షణ్ముగం ఒప్పుకోలేదు.

దీంతో ఇళమది తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ఇంతలో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకుపై దాడి చేశాడు. ఈ ఘటనను ఊహించని ఇళమది వెంటనే తండ్రి చేతుల్లోంచి కర్రను లాక్కొని  తలపై బలంగా మోదాడు.

దీంతో షణ్ముగం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది షణ్ముగాన్ని పరీక్షించగా అతను అప్పటికే చనిపోయాడు. దీంతో పెళ్లింట్లో విషాద వాతావరణం చోటు చేసుకుంది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇళమదిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.