రామ్ గఢ్: ఉద్యోగం కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే అతి దారుణంగా హతమార్చిన దారుణ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న యువకుడు చివరకు తన తండ్రిని చంపి అతడి ఉద్యోగాన్ని పొందాలనుకున్నాడు. దీంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

రామ్‌గఢ్‌ జిల్లాలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో హెడ్‌ సెక్యూరిటీ గార్డ్‌గా క్రిష్ణ రామ్‌(55)అనే వ్యక్తి పనిచేసేవాడు. అయితే అతడు గత గురువారం    రాత్రి తన ఇంట్లోనే అతి దారుణంగా హతమార్చబడ్డాడు. నిద్రిస్తున్న సమయంలోనే కత్తితో అతడి గొంతు కోసి చంపారు. 

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య ఇంట్లోనే జరిగింది కాబట్టి కుటుంబసభ్యులను అనుమానించారు. ఈ క్రమంలోనే వారిని విచారించగా పెద్ద కొడుకు మాటలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకు అతడు అసలునిజాన్ని చెప్పాడు. 

ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న తాను తండ్రి ఉద్యోగాన్ని పొందాలనుకున్నానని... అతడు చనిపోతే కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం తనకే వస్తుందనే హత్య చేసినట్లు  ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.