చిలీ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని 1,40,000 పెసోలను బ్యాంకులో జమ చేసుకున్నాడు. ఆ డబ్బులకు ప్రభుత్వం హామీ ఉన్నది. ఆ పెద్ద మనిషి మరణించిన తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు ఆ బ్యాంక్ బుక్ చూశాడు. కానీ, ఆ బ్యాంకు ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ప్రభుత్వ హామీ ఉన్నందున కొడుకు కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వంపైనే దావా వేసి తండ్రి ఆస్తి కోసం పోరాడుతున్నాడు. 

న్యూఢిల్లీ: వారసత్వ సంపద కోసం ఘర్షణలు ఉండవని కాదు. తోబుట్టువులతో ఆ గొడవలు ఉంటాయి. చివరకు అదో కొలిక్కి రాకమానదు. కానీ, చిలీకి చెందిన ఓ వ్యక్తి తండ్రి సంపాదించిన సంపద కోసం తోబుట్టువులతోకాదు.. ఏకంగా ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తున్నది. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు.

చిలీ దేశానికి చెందిన హినోజోసా తండ్రి మరణించాడు. ఆయన ఇల్లు కట్టుకోవాలని ఆశించాడు. ఇంటి నిర్మాణం కోసం సుమారు 1.40 లక్షల పెసోలు కూడబెట్టాడు. అయితే, ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకులో దాచుకున్నాడు. కానీ, ఇప్పుడు ఆ బ్యాంకు పని చేయడం లేదు. అంటే.. ఆ బ్యాంకును ప్రభుత్వం ఎన్నడో రద్దు చేసింది. 

తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువులు చాలా రోజులు వారికి దూరంగానే ఉంచేశాడు. ఇటీవలే హినోజోసా ఆయన వస్తువులను ఒక్కొక్కటి చూశాడు. అందులో పలు బ్యాంకు బుక్‌లు కనిపించాయి. అన్నీ విలువ లేనివిగా కనిపించాయి.. ఒక్కటి మినహా. ఒక బ్యాంకు బుక్‌పై ప్రభుత్వ గ్యారంటీ అనే వ్యాఖ్యం తన దృష్టిని ఆకర్షించిందని హినోజోసా తెలిపాడు. ఆ బ్యాంక్ బుక్ పరిశీలించాడు.

ఇల్లు కట్టుకోవాలనే ఆశతో 1960, 70లలో ఆయన ఆ బ్యాంకులో సేవింగ్స్ చేశాడు. అప్పుడే 1,40,000 పెసోలు జమ చేశాడు. వాటికి వడ్డీ, ద్రవ్యోల్బణాన్ని కూడా గణిస్తే ఇప్పుడు ఆ 1,40,000 పెసోలు వంద కోట్ల పెసోలు. అంటే సుమారు 12 లక్షల అమెరికన్ డాలర్లకు సమానం. కానీ, ఆ బ్యాంకు ఇప్పుడు మనుగడలో లేదు. కానీ, ప్రభుత్వ హామీ అని బ్యాంక్ బుక్‌పై అప్పటి హామీ ఉన్నది.

దీంతో ఈ సమస్య అటు ప్రభుత్వానికి, ఇటు హినోజోసాకు తలనొప్పిగా మారింది. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు తనకు దక్కాల్సిందేనని హినోజోసా వాదిస్తున్నాడు. ఈ కేసు కోర్టులు మారుతూ వస్తున్నది. చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. తన తండ్రి ఆస్తి దక్కించుకోవడానికి తాను ప్రభుత్వంపైనే లా సూట్ వేయాల్సి వస్తుందని భావించలేదని హినోజోసా అన్నాడు.

ఇది వరకు హినోజోసా ఆశ్రయించిన కోర్టులు అన్నీ ఆయనను సమర్థిస్తూనే తీర్పు వెలువరించాయి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు విచారించనుంది.