కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ, అసోం పీసీసీ మాజీ చీఫ్ రిపున్ బోరా పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన తన రాజీనామా లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీపై పోరాడాలనే కర్తవ్యాన్ని వదిలిపెట్టి, బీజేపీ ప్రభుత్వంతోనే పీసీసీ సభ్యులు రహస్య ఒప్పందాన్ని నెరుపుతున్నారని ఆరోపించారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రిపున్ బోరా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అనంతరం ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకున్నారు. రిపున్ బోరా కాంగ్రెస్ తరఫున గతంలో రాజ్యసభ ఎంపీగా చేశారు. అంతేకాదు, అసోం పీసీసీ అధ్యక్షుడిగాను సేవలు అందించారు.

తన రాజీనామాను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఈ రోజు నుంచి తాను కొత్త రాజకీయ ప్రయణానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఆయన తన రాజీనామా లేఖ రాశారు. అందులో సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు ఆరోపణలు చేశారు. తాను పార్టీని వీడాలనే కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను పేర్కొన్నారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి కట్టుగా ఐక్యంగా పోరాడాల్సిందని, కానీ, పలు స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ కర్తవ్యాన్ని పక్కనపెట్టి తమ స్వప్రయోజనాల కోసం అంతర్గతంగానే పోరు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

2016 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తను పార్టీని పునరుజ్జీవనం చేయడానికి రేయింబవళ్లు కష్టపడ్డానని పేర్కొన్నారు. కానీ, అసోం పీసీసీలోనే కొన్ని సీనియర్ నేతల వర్గాలు అంతర్గత పోరుకు తెరలేపారని ఆరోపించారు. ఈ అంతర్గత వైరాల కారణంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందని, అందుకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకోలేకపోయిందని వివరించారు.

Scroll to load tweet…

కొందరు పార్టీ నేతలు దురదృష్టవశాత్తు బీజేపీకి అధికారం దక్కేలా వ్యవహరించారని ఆరోపించారు. రాజ్యసభ సీట్లను బీజేపీ గెలుచుకోవడంలో ఇది కనిపించిందని తెలిపారు. బీజేపీతో రాజీలేకుండా పోరాడటం మానేసి.. అసోం పీసీసీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీ ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందాన్ని మెయింటెయిన్ చేస్తున్నారన్న విషయం రాష్ట్రంలో ఓపెన్ సీక్రెట్ అని సంచలన ఆరోపణలు చేశారు.

ఇలాంటి కారణాలతోనే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగలేకపోయానని వివరించారు. అయినప్పటికీ రానున్న రోజుల్లో తాను బీజేపీపై రాజీలేకుండా కఠిన పోరు చేస్తానని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడతానని పేర్కొన్నారు.