ఇటీవల ముగిసిన జమ్మూకాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలతో అక్కడి ప్రజాస్వామ్య మూలాలు మరింత బలపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు.

యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ పోలింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారని ఆయన ప్రశంసించారు. అందుకు మోడీ కాశ్మీరీలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ది మండళ్ల (డీడీసీ) ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని చెప్పారు.

సెహత్‌ (ఎస్‌ఈహెచ్‌ఏటీ) పేరిట ఆయూష్మాన్‌ భారత్‌ పథకాన్ని జమ్మూ-కశ్మీర్‌కు విస్తరిస్తూ ప్రధాని పై విధంగా వ్యాఖ్యలు చేశారు.  ఇదే సమయంలో విపక్షాలకు చురకలంటించారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ కాలంలోనే జమ్మూ-కశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు జరిగాయని మోడీ గుర్తుచేశారు. కానీ, పుదుచ్చేరిలో మాత్రం గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ పంచాయతీ ఎన్నికలు జరపడం లేదని ప్రధాని దుయ్యబట్టారు.

అలాంటివారు తనకు ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు తన మార్క్ పంచ్‌లు వేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా జమ్మూకశ్మీర్‌లో 12 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు. పథకం ప్రారంభమైన ఈ రోజు జమ్మూకశ్మీర్‌ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించారు.

జమ్మూ కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్లకు (డీడీసీలకు) జరిగిన ఎన్నికల్లో ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఏడు పార్టీల కూటమి- పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్‌ డిక్లరేషన్ (పీఏజీడీ) ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 280 డీడీసీలకు ఎన్నికలు నిర్వహించగా పీఏజీడీ 117, బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు 40 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ 26 స్థానాల్లోనూ గెలుపొందాయి