బెంగళూరు: హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ల సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ లేవనెత్తిన అంశాలపై చాలా మంది తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

తాజాగా బీజేపీ ఎంపీ, వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ విషయమై చాలా ఘాటుగా స్పందించారు. కొద్ది మంది కార్పొరేట్ ఓనర్లు అభద్రతా భావంతో జీవిస్తున్నారని ఆయన అన్నారు. దానికి కారణంగా యూపీఏ హయాంలో ఈ సదరు కార్పొరేట్ కంపెనీల ఓనర్లు తమకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలను మార్చుకునేవారని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

నరేంద్రమోడీ నాయకత్వంలో ఆ సదరు కార్పొరేట్ యజమానులకు తమకు అనుకూలంగా ప్రభుత్వ విధానాన్ని మార్పించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసమే వారు అభద్రతా భావానికి లోనవుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. న్యూ ఇండియా అంటే ఇలానే ఉంటుందని, దీనికి అలవాటుపడిపోయి జీవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.  

మరో ట్వీట్లో వారసత్వ వ్యాపారులకు, నూతనంగా ఎదుగుతున్న నవ వ్యాపారనాయకులకు మధ్య తేడాను ఎత్తి చూపారు. వారసత్వంగా వ్యాపారసామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నవారు నూతన యువ వ్యాపారవేత్తలను చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. 

నూతన ఆవిష్కరణల ద్వారా వ్యాపారంలో ముందుకెళుతూ, ఆర్ధిక వ్యవస్థలో ధనాన్ని సృష్టించి గౌరం సంపాదించడం ఎలాగో యువ వ్యాపారవేత్తలను చూసి నేర్చుకోవాలని, అంతే తప్ప లైసెన్సులను తెచ్చుకొని, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసి, ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం ద్వారా మాత్రం కాదని స్పష్టం చేసారు. 

ఇలా యువ వ్యాపార వేత్తలకు, వారసత్వ వ్యాపార సామ్రాజ్యాల అధినేతలకు ఉండే తేడాను ఎత్తి చూపారు.