కోవిడ్‌ను నివారించేందుకు ఇవాళ్టీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ విధానం ద్వారా మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరిగింది. అయితే తూర్పు లఢఖ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైన్యానికి కూడా టీకాలు వేశారు. దీంతో సాయుధ బలగాల విభాగంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిగా ఇక్కడి జవాన్లు రికార్డుల్లోకి ఎక్కారు. 

సిబ్బందిలోనూ సైనిక వైద్యులు, పారామెడిక్స్, లే వద్ద ఫ్రంట్ లైన్ దళాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. టీకా కోసం మొత్తం 4,000 మంది సైనికులను గుర్తించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 2020 మే నుంచి తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా దళాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. 

కరోనా మహమ్మారితో పోరాడటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న సైనిక వైద్యులు , ఇతర వైద్య సిబ్బందికి టీకా పంపిణీలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. టీకాలు వేయడానికి ఫ్రంట్ లైన్ దళాలను కూడా గుర్తించామని అధికారులు వెల్లడించారు. 

శుక్రవారం ఢిల్లీలో జరిగిన 73వ ఆర్మీడే వేడుకలను పురస్కరించుకుని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మాట్లాడుతూ.. గతేడాది సైన్యం అనేక సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. ప్రధానంగా కోవిడ్ 19, ఉత్తర సరిహద్దులే ముఖ్యమైన సవాలుగా నరవణె వ్యాఖ్యానించారు. కాగా దేశంలోని 3,006 కేంద్రాల్లో టీకాను పంపిణీ చేస్తున్నారు.