న్యూఢిల్లీ:  ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ వలయాకార సూర్యగ్రహణం ఏర్పడింది. దేశంలోని పలు చోట్ల పాక్షికంగా సూర్య గ్రహణం కన్పించింది. సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని దేశంలోని పలు ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ, పూజా కార్యక్రమాల తర్వాత ఇవాళ సాయంత్రం ఆలయాలను తిరిగి తెరవనున్నారు.

 రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో సంపూర్ణ సూర్యగ్రహణం కన్పించింది. సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను నిన్న సాయంత్రమే మూసివేశారు. సంప్రోక్షణ పూజల తర్వాత ఇవాళ ఆలయాలను తిరిగి తెరుస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం 10:18 గంటల నుండి సూర్యగ్రహణం ప్రారంభమైంది.  దీంతో ప్రముఖ తిరుమల వెంకన్న దేవాలయం మూసివేశారు. 

శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ ముగియగానే శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ  మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. నిత్య కైంకర్యాల తర్వాత ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. 

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకే మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీశైలం భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా శనివారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. నేడు గ్రహణం వీడిన తర్వాత మంగళ హారతులు, కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి యథావిథిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.తెలంగాణలోని యాదాద్రితో పాటు పలు దేవాలయాలను కూడ మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను తిరిగి తెరుస్తారు. 

తెరిచిన శ్రీకాళహస్తి దేవాలయం

సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం నుండి శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి ఉంచారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయంలో రాహు కేతు పూజలు నిర్వహించేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు.