హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం సూర్యగ్రహణం పడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను మూసివేస్తున్నారు. గురువారం ఉదయం 8.08 నుంచి 11.16 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవిస్తోంది. 

సూర్యగ్రహణం నేపథ్యంలో బుధవారం రాత్రి 11 గంటలకే తిరుమల ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుడి తలుపులు తీసి, 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గురువారంనాడు స్టేలెట్డ దివ్య, సర్వ దర్శనాలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. 

శ్రీశైలంలోని రెండు దేవాలయాలను కూడా బుధవారం రాత్రి పది గంటలకు మూసివేస్తున్నారు. తిరిగి గురువారం ఉదయం 11.30 గంటలకు తెరుస్తారు. ఒంటి గంట నుంచి భక్తులను దర్సనానికి అనుమతిస్తారు. 

Also Read: రేపే సూర్యగ్రహణం: ఆ గుడి మాత్రం మూసేయరు, ఎందుకంటే.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గురువారం మూసి వేయనున్నారు. బుధవారం రాత్రి స్వామివారి శయనోత్సవ దర్శనాల తర్వాత ఆలయ ద్వారబంధనం జరుపుతారు. మర్నాడు గ్రహణ మోక్ష కాలం తర్వాత 12 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ జరుపుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం రాత్రి నుంచి 15 గంటల పాటు మూసివేస్తారు. భద్రాచలంలోని శ్రీ సీతారామసవామి ఆలయాన్ని బుధవారం రాత్రి మూసేసి గురువారం 12 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.