హైదరాబాద్: ఈ ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. క్రిస్మస్ వేడుకల తర్వాత ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ నెల 26వ తేదీ గురువారం ఈ ఏడాది చివరి సూర్యగ్రహణాన్ని చూడబోతున్నాం. 

సూర్యునికి చంద్రుడు అడ్డం వచ్చి ఓ బంగారు రింగు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని భారత్, ఆస్ట్రేలియా, పిలిప్పైన్స్, సౌదీ అరేబియా, సింగపూర్ ల్లో చూడవచ్చు. సూర్య కాంతి చంద్రుడి నుంచి జారుకుంటూ వెళ్తున్న క్రమంలో అతి సుందరమైన వలయాకార దృశ్యం చోటు చేసుకుంటుంది. కంకణం మాదిరిగా ఉంటుంది.

వలయాకార సూర్యగ్రహణం అంటే...

సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ గురువారంనాటి సూర్యగ్రహణం అలా ఉండదు. ఆ రోజు భూమికి చంద్రుడు మామూలు కన్నా చాలా దూరంలో ఉంటాడు. ఆ స్థితిలో అది సూర్యుడిని దాటే సమయంలో నెగెటివ్ షాడో లేదా అంటుబ్రా కనిపిస్తుంది. అది రింగు మాదిరిగా కనిపిస్తుంది. దాన్ని వలయాకారం సూర్యగ్రహణం అంటారు.

ఏ సమయంలో సూర్యగ్రహణం.....

నార్వేకు చెందిన టైమ్ అండ్ డేట్ డాట్ కామ్ ప్రకారం ఆసియా ఖండంలోని చాలా దేశాల్లో కనిపిస్తుంది. దక్షణి భారత దేశంలోనే కాకుండా ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 7:59:53 గంటలకు కనిపిస్తుంది. పూర్తి సూర్యగ్రహణం ఉదయం 9:04:33 గంటలకు ఏర్పడుతుంది. గరిష్ట స్థాయి సూర్యగ్రహణం ఉదయం 10:47:46 గంటలకు ఏర్పడుతుంది. సూర్యగ్రహణం గరిష్టంగా 3 నిమిషాల 40 సెకండ్లు ఉంటుంది. బ్రిటన్, ఉత్తర అమెరికా ప్రజలు దీన్ని చూడలేరు. 

సేఫ్ గా చూడాలంటే...

సూర్యగ్రహణాన్ని చూడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. అలా చూస్తే కళ్లు దెబ్బ తింటాయి. అందువల్ల ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ ధరించాల్సి ఉంటుంది. 

తర్వాతి గ్రహణం ఎప్పుడు...

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2020 జనవరి 10వ తేదీన తొలి చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.