సామాజికవేత్త, ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ క్సశుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు.

గత నాలుగు రోజులుగా ఆయన శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోతున్నాయి. ఆయన నాలుగు రోజుల నుండి కూడా వెంటిలేటర్ మీదనే చికిత్స పొందుతూ ఉన్నారు. చికిత్స పొందుతూ ఇందాక కొద్దీ సేపటి కింద తుది శ్వాస విడిచారు. 

సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఆయనను మామూలు స్థితికి తీసుకురాలేకపోయామని, సుమారు 6.30 ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

రేపు ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని జంతర్ మంతర్ లోని ఆయన ఇంటి వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు గురుగ్రంలో ఆయన అంతిమ,ఆ సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలియవస్తుంది. 

ఈ నెల 21 వస్తే ఆయన 81వ వసంతంలోకి అడుగుపెట్టే వాడు. ఆయన పుట్టినరోజుకి 10 రోజుల ముందే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. లెక్చరర్ గా కెరీర్ ని ఆరంభించిన అగ్నివేశ్... సవ్యసాచి ముఖర్జీ కింద లా ప్రాక్టీస్ చేసారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం శ్లాఘనీయం. ఆయన 1981లో స్థాపించిన బాండెడ్ లేబర్ ఫ్రంట్ ద్వారా ఆయన కృషి చిరస్మరణీయం. 

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటానికి ఆయన తన పూర్తి మద్దతును తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నినదిస్తూ కేసీఆర్ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.