పాములు, ఇతర జీవరాశికి మనిషి ఆవాసాలు లేకుండా చేస్తుండటంతో అవి జనాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఏకంగా ఇంటి ఏసీలో దూరి, దాదాపు మూడు నెలల పాటు ఏంజాయ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరి తెంగాయితిట్టుకు చెందిన ఏలుమలై ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఏసీ ఉంది. ఏసీ ఆన్ చేయగానే ఈ మధ్యకాంలో తరచుగా శబ్ధం వస్తోంది. దీంతో ఆయన మెకానిక్‌ను పిలిపించాడు.

ఏసీని విప్పి చూడగా రెండు పాము కుబుసాలు కనిపించాయి. జాగ్రత్తగా పరిశీలించగా అందులో ఓ పాము ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

వారు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి  రెండు అడుగుల పామును బయటకు తీశారు. ఏసీకి ఉన్న బయటి వైపు పైపును సరిగ్గా మూయకపోవడం వల్లే పాము లోనికి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.. పట్టుకున్న పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.