ఓ పోలీస్ స్టేషన్ లోకి పాము దూరింది. దానిని ఎలా బయటకు తీయాలో తెలియని పోలీసులు నాగ స్వరం ఊదారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజ్నోర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లోకి పాము ప్రవేశించింది. దీంతో పోలీసులు ఆ పామును పట్టుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు పోలీసులు నాగస్వరాన్ని ఊదుతూ పామును పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు. 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్‌లోకి ఒక పాము ప్రవేశించగానే.. పోలీసులు హడలెత్తిపోయారు. తరువాత పాములు పట్టేవారిని పిలిపించారు. అయితే వారు నాగస్వరం ఊదకుండా పాములను పట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొద్దిసేపు నాగస్వరం ఊదారు. అయినా ఆ పాము ఎంతకూ బయటకు రాలేదు. చాలాసేపు ప్రయత్నించిన అనంతరం అతికష్టం మీద ఆ పామును పట్టుకోగలిగారు.

ఆ పాముని పట్టుకున్న తర్వాత... దగ్గర్లో ఉన్న అడవిలో దానిని వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.