ఆయన పాములను పట్టడంలో నేర్పరి. ఆయన జీవితకాలంలో దాదాపు పది వేల విష సర్పాలు చాలా నేర్పుగా పట్టుకొని ఉంటాయి. అలాంటి వ్యక్తి కరోనాకి బలయ్యాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై అంబత్తూరు కల్లికుప్పంకు చెందిన స్టాన్లీ ఫెర్నాండజ్‌ (62) వృత్తిరీత్యా టీవీ చానళ్లలో కెమెరామెన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రవృత్తి రీత్యా పిన్న వయస్సు నుంచి పాములు పట్టడంలో నేర్పరైన ఫెర్నాండెజ్‌... ‘స్నేక్‌ స్టాన్లీగా’ ప్రసిద్ది చెందారు.

చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లో దూరిన పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడంలో అటవీ, అగ్నిమాపకశాఖల అధికారులకు సహకరించేవారు. ఇలా పాతికేళ్లలో సుమారు పదివేలకు పైగా విషసర్పాలను పట్టుకున్నారు. 60 ఏళ్లు దాటినా ఏ మాత్రం వెరవక పాములు పట్టుకోవడం కొనసాగిస్తూ ఇది కూడా ఒకరకం సమాజసేవ అనేవారు. ఐదు రోజుల క్రితం పాజిటీవ్‌ నిర్దారణ కావడంతో చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. అతడికి భార్య కొచ్చీ థెరసా (54), కుమార్తె షెరీన్‌ ఇమ్మానువేల్‌ (32), కుమారుడు సెట్రిక్‌ (28) ఉన్నారు.