Asianet News TeluguAsianet News Telugu

ఒకే కుటుంబంలో 11మందిని కాటేసిన పాము.. ఐదుగురు మృతి..!

కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలో 11మందిని పాము కాటు వేసింది. వీరిలో ఐదుగురు మృతి చెందారు. అయితే, ఇది 25యేళ్ల కాలంలో జరిగింది. వీరంతా ఒకే ప్రదేశంలో పాము కాటుకు గురవుతుండడంతో అనుమానాలకు దారి తీస్తోంది. 

snake bite11 people in the same family in 25 years, Five died in karnataka
Author
First Published Aug 25, 2022, 9:44 AM IST

కర్ణాటక : పాములు పగబట్టడం.. తమకు హాని చేసిన మనుషుల్ని గుర్తుపట్టి మరీ కాటు వేయడం.. ఇదొక మంచి కమర్షియల్ కాన్సెప్ట్. ఈ కథతో వచ్చిన సినిమాలన్నీ హిట్టుకొట్టినవే. అయితే నిజంగా పాములు పగబడతాయా? వరుసగా తమకు హాని చేసిన వారిని కాటు వేసుకుంటూ వెడతాయా? అంటే శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. అయితే జనసామాన్యంలో మాత్రం పాములకు సంబంధించి ఇలాంటి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్నిసార్లు అవి నమ్మాలో లేదో తెలియదు. మన ఊహకు అందని విషయాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని పాము కాటు వేసింది. వీరిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే,  ఇలా చనిపోయిన వారంతా పురుషులే కావడంతో.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవుతున్నారు. గడిచిన 20-25 యేళ్లలో పాము కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతోపాటు హనుమంతప్ప,  వెంకటేష్,  శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు.

పాము కాటుతో కొడుకు మృతి.. బతికొస్తాడని 30 గంటలు పూజలు..

గత బుధవారం రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెరుగుతుండగా పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాటుకు గురయ్యారు. ధర్మణ్ణ ఒకరోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నఫలంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాతి కాలంలో మళ్ళీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జూలైలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో చోటు చేసుకుంది. పాములు పగ బడతాయా? అదేమో తెలియదు కానీ.. ఓ విద్యార్థి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు వరుసగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణను జూలై 23న ఓ పాము కాటు వేసింది. వెంటనే టీచర్లు అతడిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. 

అయితే కృష్ణను పాము కాటు వేయడం ఇది మొదటి సారి కాదు అని తేలింది. పెద్ద కొడప్ గల్ మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్ గల్ లోని బాలుర సంక్షేమ హాస్టల్ లో ఇదే విద్యార్తఇకి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్ లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios