స్లిప్పర్స్ లో రహస్యంగా కిలోకు పైగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన వ్యక్తి దగ్గర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

బెంగళూరు : బెంగళూరు విమానాశ్రయంలో రూ. 69.40 లక్షల విలువైన బంగారాన్ని చెప్పుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని బెంగళూరు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఇకపై చెప్పులను స్కానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండబోతున్నారు. ఎందుకంటే స్మగ్లర్లు స్కానింగ్ కు చిక్కకుండా ఉండాలని చెప్పులలోపల బంగారు బార్స్ ను దాచి తీసుకురావడం బయటపడింది. 

"ఇండిగో ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ నుండి బెంగళూరు చేరుకున్న ప్రయాణీకులను చెకింగ్ కోసం ఆపారు. వారి వద్ద నుంచి చెప్పుల లోపల నాలుగు అరలలో అమర్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు’అని కస్టమ్స్ అధికారి బుధవారం తెలిపారు. ఇలా పట్టుబడిన బంగారం విలువ రూ. 69.40 లక్షలు ఉంటుందని, 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన ప్యూర్ గోల్డ్ అని.. కనీసం 1.2 కిలోలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 

మార్చి 12న ఇండిగో ఫ్లైట్ 6ఈ 76లో బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ప్రయాణికుడిని బెంగళూరు కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని అడగగా.. ప్రయాణీకుడు వైద్యం కోసం వచ్చినట్లుగా తెలిపాడు. అయితే, సదరు ప్రయాణికుడు ఎలాంటి సరైన వైద్య పత్రాలను అందించకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది.

దీంతో ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరీక్షించారు. బాడీ చెక్ చేసి, అతని బ్యాగ్, చెప్పులను స్కానింగ్ చేయగా, అతను ప్రయాణ సమయంలో ధరించిన చెప్పుల మీద అనుమానం వచ్చింది. వాటిని కోసి చూడగా ముక్కల రూపంలో నాలుగు అరలలో దాచిన బంగారం బయటపడింది. చెప్పులలో, రూ. 69.40 లక్షల విలువైన 24 కిలోల స్వచ్ఛత కలిగిన 1.2 కిలోల బరువున్న 4 బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ కస్టమ్స్ అధికారి తెలిపారు.

Scroll to load tweet…