Smriti Irani: 'తప్పిపోయిన 3.97 లక్షల మంది పిల్లల్ని వారి కుటుంబాలతో కలిపాం'
Smriti Irani: 2015 నుంచి తప్పిపోయిన 4.46 లక్షల మంది చిన్నారుల్లో 3.97 లక్షల మంది చిన్నారులు తిరిగి వారి కుటుంబాలతో కలిశారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మిషన్ వాత్సల్య కింద దాదాపు నాలుగు లక్షల 46 వేల మంది తప్పిపోయిన చిన్నారులు దొరికారని సగర్వంగా చెప్పుకుంటామని కేంద్ర మంత్రి ఇరానీ అన్నారు.

Smriti Irani: గత తొమ్మిదేండ్లలో తప్పిపోయిన 4.46 లక్షల మంది చిన్నారుల్లో దాదాపు 3.97 లక్షల మంది చిన్నారుల ఆచూకీ తెలుసుకుని, వారిని తిరిగి వారి కుటుంబాలతో చేర్చామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం తెలిపారు. పిల్లల రక్షణపై జాతీయ వార్షిక వాటాదారుల సంప్రదింపుల కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఇరానీ మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య కింద దాదాపు నాలుగు లక్షల 46 వేల మంది తప్పిపోయిన పిల్లలను కనుగొన్నామని, అందులో 3,97,530 మంది చిన్నారులు తిరిగి వారి కుటుంబాలతో చేర్చామని గర్వంగా చెప్పగలమని అన్నారు.
2021లో జువెనైల్ జస్టిస్ యాక్ట్‌కు సవరణ చేసినప్పటి నుంచి దాదాపు 2,600 మంది పిల్లలను దత్తత తీసుకున్నామనీ, ఈ సవరణ ప్రకారం కోర్టులకు బదులుగా జిల్లా మేజిస్ట్రేట్‌కు దత్తత ఉత్తర్వులు జారీ చేసే బాధ్యతను అప్పగించామని తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సిసిఐలలో (చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్) 45,000 మందికి పైగా పిల్లలకు టీకాలు వేయడమే కాకుండా సహాయాన్ని కూడా అందించామని తెలిపారు.
కేంద్ర మంత్రి ఇరానీ ఇంకా మాట్లాడుతూ.. శిశు సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 2009-10లో రూ.60 కోట్లు కాగా, గతేడాది రూ.14,172 కోట్లకు పెరిగిందని తెలిపారు. 2014 నుండి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌ల ద్వారా ఏడు లక్షల మందికి పైగా పిల్లలకు మద్దతు లభించిందన్నారు.
ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) భారత ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ తన ప్రసంగంలో.. బాలల రక్షణకు సంబంధించి భారతదేశం చేస్తున్న కృషిని ప్రశంసించారు. యునిసెఫ్ ఇండియా భాగస్వామ్యంతో జువైనల్ జస్టిస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌పై సుప్రీంకోర్టు కమిటీ సెప్టెంబర్ 23,24 తేదీలలో దేశ రాజధానిలో రెండు రోజుల జాతీయ సంప్రదింపులను నిర్వహిస్తోంది.
జువైనల్ నేరస్తులు పుట్టుకతో నేరస్థులు కారు: జస్టిస్ నాగరత్న
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ. నాగరత్న మాట్లాడుతూ.. జువైనల్ నేరస్తులు పుట్టుకతో నేరస్తులు కాదని, తల్లిదండ్రుల లేదా సామాజిక నిర్లక్ష్యానికి గురవుతారని అన్నారు. సంరక్షణ, రక్షణ అవసరం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న పిల్లలకు సహాయం చేస్తామని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.
ఈ బాలలను హక్కులను పరిరక్షించడంతోపాటు వారి సాధికారత కూడా మన లక్ష్యం కావాలని అన్నారు. పిల్లలలో దూకుడు స్థాయిలు పెరుగుతున్న భయంకరమైన ధోరణిని దృష్టిలో ఉంచుకుని, మన పాఠ్యాంశాల్లో దయ, గౌరవం, సానుభూతి యొక్క విలువలను నొక్కిచెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆందోళన
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ మాట్లాడుతూ.. జువైనల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు లేదా ఇతర సంస్థలలో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నందున, ఈ సంస్థలు పిల్లల రక్షణ విషయాలలో "కాగితపు పులులు" అని నిరూపించవచ్చని అన్నారు. సామర్థ్యాలను మెరుగుపరచడం, పిల్లలకు సకాలంలో న్యాయం చేయడానికి అడ్డంకులను గుర్తించడం, వివిధ వాటాదారుల మధ్య సమన్వయాన్ని సృష్టించడంపై జస్టిస్ భట్ నొక్కిచెప్పారు.