బీజేపీ నేత స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆరుగంటల్లో 53వేలకు పైగా లైక్ లు సాధించింది. నెటిజన్ల కామెంట్లతో దూసుకుపోతోంది.
స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో కేవలం ఆరు గంటల్లోనే 53 వేలకు మించిన లైక్ లతో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే... స్మృతి ఇరానీ స్కూటీమీద వెడుతున్నారు. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌తో కలిసి స్కూటీ నడుపుతున్నారు. ఈ వీడియోలో ఆమె మాటలు కూడా వినిపిస్తున్నాయి... భారతీ పవార్ తాయిని ఆఫీసులో దించుతున్నాను.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో ఈ రోజు చాలా చక్కగా ప్రారంభమయ్యింది.. అక్కడినుంచే బయలుదేరాం భారతీ తాయిని ఆఫీసులో దించి, నేనూ నా కార్యాలయానికి వెడతాను అంటూ చెప్పుకొచ్చారామె. ఈ వీడియోలో స్మృతి ఇరానీ ఆరెంజ్ రంగు చీర ధరించి, తలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. ఆమె బండి నడుపుతున్నారు. ఇక భారతీ పవార్ సల్వార్ కమీజ్ వేసుకున్నారు. బండి వెనుక కూర్చుని జాతీయ జెండాను పట్టుకున్నారు.బండి వెనుక భాగంలో కూడా మరో జెండా ఉంది.
ఈ వీడియోను స్మృతి ఇరానీ తన అఫీషియల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేయగా వెంటనే మంచి స్పందన లభించింది. మంత్రి అనుచరులు, కార్యకర్తలు దీనిమీద సానుకూలంగా స్పందించారు. చిత్రనిర్మాత ఏక్తా కపూర్ స్మృతి ఇరానీ లుక్స్‌పై స్పందిస్తూ.."ఎంత స్లిమ్ గా ఉన్నారు. కంగ్రాట్స్. యూ ఆర్ ఫిట్" అని వ్యాఖ్యానించింది. నటి దివ్య సేథ్ ‘ఎంత అద్భుతం’ అంటూ కామెంట్ చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమం చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ జులై 31న ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 2 నుంచి 15వ తేదీ మధ్య సామాజిక మాధ్యమాల్లో త్రివర్ణ పతాకాన్ని తమ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించడం ద్వారా దీనిని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రతీ ఇంటి వద్ద 'త్రివర్ణపతాకాన్న' ఎగురవేయాలని ప్రజలను ప్రోత్సహించారు.
గత నెలలో, ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొడుకు గురించి పెట్టిన వీడియో కూడా ఇలాగే వైరల్ అయ్యింది. ఆమె కుమారుడు జోర్ గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. కొడుకును చూసి తాను ఎంత గర్వంగా ఉందో చెప్పారు. ఆమె తన కొడుకును ట్యాగ్ చేసి, అతని గ్రాడ్యుయేషన్ గురించి రాస్తూ "కొత్త అవకాశాలకు సూచన ఇది. నీ సామర్థ్యంతో నువ్వేంటో ప్రూవ్ చేసుకోవచ్చు.. నీ కలలను సాకారం చేసుకోవచ్చు..’అంటూ చెప్పుకొచ్చారు.
