సారాంశం

ఇటీవల కాలంలో  రైళ్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.  రైళ్లలో  పొగ, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రకమైన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడ  ప్రమాదాలు ఆగడం లేదు.


చెన్నై: తిరువనంతపురం ఎక్స్ ప్రెస్ రైలుకు  బుధవారం నాడు  తృటిలో ప్రమాదం తప్పింది.  ఈ రైలులోని ఏసీ బోగీల నుండి పొగ రావడంతో రైలును నిలిపివేశారు. చెన్నై శివారులోని  నెమిలిచ్చేరి  వద్ద రైలును నిలిపివేసి అధికారులు పొగ ఎందుకు వస్తుందో  పరిశీలిస్తున్నారు. 

గతంలో కూడ దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలులో  మంటలు, పొగ వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  తిరుపతి జిల్లాలోని వెంకటగిరి రైల్వే స్టేషన్ లో  కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో  మంటలు వ్యాపించడంతో  రైలును నిలిపివేశారు.  ఆగస్టు 19వ తేదీన బెంగుళూరులో కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో  ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి.  దీంతో రైలును నిలిపివేశారు.

ఈ ఏడాది జూన్  6న సికింద్రాబాద్ అగర్తల ఎక్స్ ప్రెస్ రైలులో కూడ మంటలు వ్యాపించాయి.ఈ ఏడాది  ఆగస్టు  13న  ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. దీంతో రైలును స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు అధికారులు.  రైలు లైనర్లు జామ్ కావడంతో  పొగ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. మరమ్మత్తు చేసిన తర్వాత రైలును పంపించారు. 2022 మే 30న కూడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులోని ఓ బోగీ నుండి పొగ వెలువడింది.

2021  జూన్  16న ఇంటర్ సిటీ  ఎక్స్ ప్రెస్ రైలు నుండి పొగ రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరమ్మత్తులు చేసిన తర్వాత  రైలును పంపించారు.2023 ఫిబ్రవరి  26న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో  పొగలు వచ్చాయి.  దీంతో రైలును తెలంగాణలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.అహ్మదాబాద్ నుండి చెన్నైకి వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.దీంతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేసి  మరమ్మత్తులు నిర్వహించారు. 2022 నవంబర్ 17న కూడ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు  వచ్చాయి.రైలులోని పాంట్రీకారులో  మంటలు వచ్చాయి.ఈ విషయాన్ని గుర్తించి గూడూరు రైల్వే స్టేషన్ రైలును నిలిపివేసి మరమ్మత్తులు చేశారు అధికారులు.