భార్యాభర్తల మధ్య గొడవ.. 17 మంది ఆస్పత్రి పాలు.. పలువురి పరిస్థితి విషమం..అసలేం జరిగిందంటే..!
రాజస్థాన్‌లోని ఝలావర్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెద్ద వివాదానికి దారితీసింది.వారి గొడవతో 17 మంది ఆస్పత్రి పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వారి కోటాకు తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఝలావర్ జిల్లాలో అర్థరాత్రి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఇద్దరి బంధువులు మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఆ తరువాత కర్రలు, రాడ్లతో గంటపాటు భీకర వాగ్వాదం జరిగింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని.. అల్లరి మూకను చెల్లాచెదురు చేశారు. ఆ తర్వాత క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో దాదాపు 17 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 4 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం ఇరుపక్షాల తరఫున కేసు నమోదైంది.
వివరాల్లోకెళ్తే. గరీబ్ నవాజ్ కాలనీలో నివసిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ రాజిక్ అన్సారీ, ఆయన భార్య మధ్య ఈ వివాదం జరిగిందని భవానీ మండి పోలీస్ స్టేషన్ తెలిపింది. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య మళ్ళీ గొడవ జరిగింది. వివాదం తర్వాత ఇరువర్గాల నుండి చాలా మంది వ్యక్తులు సంఘటనా స్థలానికి వచ్చారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కర్రలు, రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా గాయపడ్డారు. 17 మందిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కోట జిల్లాలోని ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేశారు. రాత్రి జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారు రాజస్థాన్ పోలీసులకు తెలిపారు.
రాత్రి ఒక్కసారిగా అలజడి రేగిందని, అరుపులు వినిపించాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. జనం చూసేసరికి ఇంటి బయట గొడవ జరిగినట్లు తెలిసింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లు, ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. కొందరికి చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఇరువర్గాల నుంచి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.