అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో ఎవరికీ అర్ధం కాదు. ఫలానా సంఘటన కోసమే.. పరిస్ధితులు అన్ని సహకరించాయా అన్నట్లుగా వుంటుంది. ఇప్పుడు తమిళనాడులో అచ్చం ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాను భారతదేశ తూర్పుతీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రచండ గాలుల తీవ్రతకు ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.

ఈ క్రమంలో భీకర గాలులకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడటంతో కలకలం రేగింది. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక వీరిని ఎక్కడో హత్య చేసి తప్పించుకునేందుకు ఇక్కడ పాతిపెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Also Read:3 లక్షల ఇళ్లు ధ్వంసం, లక్షలాది ఎకరాల పంట నష్టం : బెంగాల్‌‌కు కడగండ్లు మిగిల్చిన యాస్

 

జిల్లాలోని వలినొక్కం గ్రామం.. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా జీవిస్తున్నారు. మృతదేహాలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సమీప పోలీస్‌ స్టేషన్లలో పాత మిస్సింగ్‌ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్‌, డీఎన్‌ఏ ల్యాబ్‌లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్‌ కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన ఆధారాలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం.