హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన, నీచమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. పౌల్ట్రీ ఫారం సెక్యూరిటీ గార్డు ఒకతను ఆరేళ్ల బాలికను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శవంపై అత్యాచారం చేశాడు. 

ఉత్తరాఖండ్ లోని శ్యాంపూర్ ప్రాంతంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. తన నివాసం వద్ద ఇతర పిల్లలతో ఆడుకుంటున్న బాలిక శుక్రవారం కనిపించకుండా పోయింది. సెక్యూరిటీ గార్డు సోను ఆమెను బుజ్జగించి చిడియాపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లాడు. 

దినసరి కూలీలైన బాలిక తల్లిదండ్రులు బిజ్నోర్ కు చెందినవారు. వారు పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. సంఘటన జరిగిన సమయంలో వారు పొలాలకు వెళ్లారు. కేకలు వేస్తుండడంతో సోను బాలిక గొంతు నులిమాడు. ఆ తర్వాత శవంపై అత్యాచారం చేశాడు. సంఘటనా స్థలం బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్న చోటికి కేవలం 600 మీటర్ల దూరంలోనే ఉంది. 

బాలిక శవాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోనును అరెస్టు చేశారు. అతను నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు 14 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు.