అహ్మదాబాద్: ఓ అపార్టుమెంటులో ఆరు మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. విహారానికి వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు మరణించారు. ఇద్దరు అన్నదమ్ములు, వారి నలుగురు పిల్లలు విగత జీవులపై అపార్టుమెంటులో కనిపించారు. వారు ఉరి వేసుకుని మరణించినట్లు భావిస్తున్నారు. 

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అహ్మదాబాద్ కు చెందిన అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) అన్నదమ్ములు. వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విహారానికి వెళ్తున్నామని ఇళ్లలో భార్యలకు చెప్పి తమ పిల్లలను తీసుకుని వెళ్లారు. 

అయితే 18వ తేదీ రాత్రి వరకు కూడా వారు ఇళ్లకు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు వాత్వా జిఐడీసీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న వారి అపార్టుమెంటుకు వెళ్లి చూశారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంతుకూ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు .

ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలను డ్రాయింగ్ రూమ్ లో, ఇద్దరు అమ్మాయిలు కృతి (9), సాన్వి (7) మృతదేహాలను కిచెన్ లో గుర్తించారు. 12 ఏళ్ల మయూర్, ధ్రువ్ మృతదేహాలు బెడ్రూంలో పడి ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పిల్లలకు తినిపించి ఆ తర్వాత ఉరివేసి, వారు కూడా ఉరివేసుకుని మరణించినట్లు భావిస్తున్నారు.