తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఓ ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. 

ఢిల్లీ : అప్పు విషయంలో చెలరేగిన ఓ గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను తీసుకుంది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మీద చేసిన దాడిలో అతని ఇద్దరు సోదరీమణులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలోని ఆర్కేపురం అంబేద్కర్ బస్తీలో లలిత్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఒక వ్యక్తికి అతను గతంలో రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. 

అప్పు తీసుకుని చాలా రోజులైనా చెల్లించకపోవడంతో.. తన దగ్గర తీసుకున్న మొత్తాన్ని తనకు తిరిగి చేయాలంటూ శనివారం లలిత్ అతడిని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ వ్యక్తి లలిత్ ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ పడుకున్న సమయంలో.. తనతోపాటు 15-20 మందిని తీసుకొని లలిత్ ఇంటికి వచ్చాడు.

గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. ప్రధాని మోదీ అభినందనలు

వారంతా ఒక్కసారిగా లలిత్ ఇంటి తలుపులు బాదుతూ.. రాళ్ళురువ్వుతూ హంగామా చేశారు. వారి దాడితో అదే ఇంట్లో ఉన్న లలిత్ సోదరుడు భయాందోళనలకు గురయ్యాడు. దీంతో అదే వీధిలో ఉంటున్న తన సోదరీమణులు, బంధువులకు సమాచారం ఇచ్చి పిలిపించాడు. వారందరూ రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. వారి మీద కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే లలిత్ ని కాపాడ్డానికి వచ్చిన అతని అక్కాచెల్లెలు పింకీ (30), జ్యోతి (29) కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. 

వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ వారిద్దరూ చనిపోయారు. నిందితులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా లలిత్ ను కూడా గాయపరిచింది. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అరుణ్, మిషెల్, దేవ్ అనే ముగ్గురు వ్యక్తులను ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.