చెల్లి మోజుపడి కొనుక్కున్న బైక్ అన్నపాలిట శాపంగా మారింది. చేయని పాపానికి ఓ కేసులో ఇరుక్కునేలా చేసింది. చివరికి జడ్జి మంచితనంతో కేసునుండి బయటపడి బతుకుజీవుడా అనుకున్నాడా అన్న.

వివరాల్లోకి వెడితే.. న్యూఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి ఎంతో ఇష్టంగా పసుపురంగు బైక్ కొనుక్కుంది. దీనికి ఎరుపురంగు రీములు వేయించుకుంది. ఇదే అ  అమ్మాయి అన్నపై దొంగతనం కేసు నమోదయ్యేలా చేసింది. 

ఇటీవల ఢిల్లీలో ఓ దొంగతనం జరిగింది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దొంగ ఎరుపు రంగు రీములున్న పసుపురంగు బైక్‌పై పరారయ్యాడని పేర్కొన్నారు. దీంతో అలాంటి బండి కోసం పోలీసులు వెతికారు. 

అలాంటి బండి ఉన్న అమ్మాయిని గుర్తించారు ఢిల్లీ పోలీసులు. దీంతో ఆ బండిమీద ఆమె అన్న దొంగతనం చేశాడంటూ ఆమె సోదరుడు నందాను అరెస్టు చేశారు. తాను దొంగను కానని మొత్తుకున్నా వినలేదు. 

పైగా తమకు రూ. 50వేలు లంచం ఇస్తేనే నందాకు బెయిల్‌ దొరుకుతుందని అతడి సోదరికి తేల్చి చెప్పారు. నందాను అదనపు సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి బాధితుడి ద్వారా విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. 

బెయిల్‌ కోసం ఓ ఏఎస్సై లంచం డిమాండ్‌ చేయడంపై సీరియస్‌ అయ్యారు. తప్పుడు కేసు పెట్టిన ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారి, లంచం డిమాండ్‌ చేసిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ డీసీపీని ఆదేశించారు.